
‘నీట్’గా రాశారు..
● ఉమ్మడి జిల్లాలో 16 కేంద్రాల ఏర్పాటు
● 5,483 మంది విద్యార్థులకుగాను 5,343 మంది హాజరు
● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన పాలమూరు, గద్వాల కలెక్టర్లు, ఎస్పీలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్)/జడ్చర్ల టౌన్/హన్వాడ/గద్వాల టౌన్: ఉమ్మడి జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్) అండర్ గ్రాడ్యుయేషన్–2025 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రాలతో పాటు జడ్చర్ల, హన్వాడలో 16 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 5,483 మంది విద్యార్థులకు గాను 5,343 మంది పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష సమయం ఉండగా.. మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే విద్యార్థులను అనుమతించారు. ఉదయం 11:30 నుంచి విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిచ్చారు. ఆ తర్వాత బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్ తనిఖీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన పరీక్షకు 4,454 మందికి గాను 4,338 మంది హాజరయ్యారు. ఏనుగొండలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం, ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, మోడల్ బేసిక్ స్కూల్, హన్వాడ ఎంజేపీ బీసీ బాలికల గురుకులం, జడ్చర్లలోని డాక్టర్ బీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి తనిఖీ చేశారు.
● జడ్చర్లలోని డాక్టర్ బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంలో
360 మందికి గాను 356 మంది పరీక్ష రాశారు. కళాశాల ముఖద్వారం నుంచే విద్యార్థులను ఒక్కొక్కరిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించటంతో ఎండ వేడికి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
● హన్వాడ ఎంజేపీ బీసీ బాలికల గురుకులంలో 240 మంది విద్యార్థులకు గాను 234మంది పరీక్ష రాశారు. వీరిలో 169 మంది బాలికలు, 65మంది బాలురు ఉన్నారు. అయితే పరీక్ష కేంద్రానికి వచ్చేందుకు సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌తో పాటు అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తనిఖీ చేశారు.
● జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1,029 మంది విద్యార్థులకు గాను 1.005 మంది (97.66 శాతం) హాజరయ్యారు. నిర్ణీత సమయానికి అరగంట ముందే పరీక్ష కేంద్రాల ప్రధాన గేట్లను మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే పట్టణంలో నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులతో సందడి నెలకొంది. కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్ సంయుక్తంగా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు, మార్గదర్శకాలపై దిశానిర్ధేశం చేశారు. డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సీఐలు బందోబస్తును పర్యవేక్షించారు.
● పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు చెవికమ్మలు, మెడలో ఉన్న బంగారు నగలు, ఇతర చైన్లు కలిగిన విద్యార్థులను అనుమతించలేదు. బూట్లను సైతం విప్పించారు. చేతికి ఉన్న దారాలతో పాటు మెడలో ఉన్న దారాలను కూడా అనుమతించలేదు. దీంతో విద్యార్థులు వాటిని తమ కుటుంబ సభ్యులకు అందజేసి పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు.

‘నీట్’గా రాశారు..

‘నీట్’గా రాశారు..

‘నీట్’గా రాశారు..

‘నీట్’గా రాశారు..

‘నీట్’గా రాశారు..