
భూసార పరీక్షలే భూమికి రక్ష
నమూనాల సేకరణ ఇలా..
నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు మొక్కలు తొలగించాలి. ఆగర్ లేదా పార ద్వారా నమునాలు సేకరించాలి. పొలంలో ‘వి’ ఆకారంలో గుంతలు తీయాలి. గుంత అంచుల నుంచి పారతో గాని లేదా తాపీతో గాని మట్టిని సేకరించాలి. పొలంలో 8 నుంచి 10 స్థలాల్లో మట్టిని సేకరించాలి. సేకరించిన మట్టిని కలిపి నేల మీద పరిచి దానిని నాలుగు భాగాలు చేయాలి. మూలలకు ఎదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకొని మిగిలిన మట్టిని పారవేయాలి. ఇలా అర కిలో మట్టి నమూనాలు సేకరించాలి. ఆ మట్టిని వస్త్రం లేదా పాలిథిన్ సంచిలో నింపి అందులో రైతు పేరు, చిరునామా, సర్వేనంబర్, పొలం విస్తీర్ణం, మెట్ట/పల్లం/ఆరుతడి పంటలు, మూడేళ్లుగా వాడుతున్న ఎరువులు, రాబోవు సీజన్‌లో వేయాల్సిన పంటలు, సేకరించిన తేదీ వివరాలతో భూసార పరీక్షా కేంద్రాలకు పంపాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలతో మట్టి నమూనాలు పంపితే కచ్చితమైన ఫలితాలు వస్తాయి.
అలంపూర్: భూసార పరీక్షలు భూమికి రక్షణగా నిలుస్తాయి. భూమిలోని పోషకాలు, వాటి లోపాలు తెలుసుకోవడానికి, అందుకు అనుగుణంగా పంటలు సాగు చేయడానికి తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ రైతులకు సూచిస్తున్నారు. అధిక దిగుబడులు సాధించాలనే ఆలోచనతో రైతులు మితిమీరిన రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. దీంతో నాణ్యమైన దిగుబడులు లేకపోగా.. చీడపీడల ఉధృతి, వాతావరణ కాలుష్యం, చౌడు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి భూసార పరీక్షలు తప్పనిసరిగా మారాయని తెలిపారు.
భూసార పరీక్ష అంటే..?
పొలం నుంచి సేకరించిన మట్టిని ప్రయోగశాలల్లో వివిధ భౌతిక, రసాయనిక పద్ధతుల్లో విశ్లేషించి వాటి లక్షణాలు.. ఉన్న పోషకాలు.. తక్కువగా ఉన్నవి, మధ్యస్తంగా ఉన్నవి ఏమిటి? తెలుసుకొని వాటి ఆధారంగా ఏ పంట వేసుకోవాలో నిర్ణయించుకొనే అవకాశం ఉంటుంది. అందుకు ఎంత మోతాదులో ఎరువులు వినియోగించాలో తెలుసుకోవడమే భూసార పరీక్షలు.
మట్టి నమూనాల సేకరణ..
పంట కోత తర్వాత వేసవిలో, పంటలు లేని సమయాల్లో మట్టి నమూనాలు జాగ్రత్తగా తీసి పంపాలి. ఎరువులు వేసిన తర్వాత నెల వరకు మట్టి నమూనాలు తీయకూడదు. నీరు పెట్టిన తర్వాత, నీడ ఉండే ప్రదేశాలు, నీటి ముందున్న ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించరాదు. ఎరువుల కుప్పల వద్ద, గట్ల వద్ద, చెట్ల దగ్గరి ప్రాంతాల్లో మట్టిని తీయరాదు.
ఎంత విస్తీర్ణానికి..
ఒక పొలానికి ఒక నమూనా తీయాలి. పొలం విస్తీర్ణం అధికంగా ఉంటే ప్రతి రెండు నుంచి ఐదు ఎకరాలకు ఒక నమూనా సేకరించాలి. నేల నిర్మాణం, రంగు, మురుగు పారుదల సౌకర్యం, నేల వాలు, చౌడు, క్షార, ఆమ్ల గుణాలు, పంటల సరళి తదితర విషయాల్లో తేడాలు కనిపిస్తే అన్నిరకాల నమూనాలు పొలం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.
● వ్యవసాయ పంటలకు 6 అంగుళాలు, పండ్ల తోటలకు 5 నుంచి 6 అడుగుల వరకు ప్రతి అడుగుకు ఒక నమూనా, చౌడు, ఆమ్ల నేలల్లో అడుగు లోతులో ప్రతి 6 అంగుళాలకు ఒక నమూనా తీయాలి.
పాడి–పంట

భూసార పరీక్షలే భూమికి రక్ష