
పాలమూరులో అలరించిన శ్రీకృష్ణ తులాభారం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ టౌన్‌హాల్‌లో స్వరలహరి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన శ్రీకృష్ణతులాభారం నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. మహిళా కళాకారిణులు ఈ పౌరాణిక పద్యనాటకాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణగా నంబి అనూష, సత్యభామగా జి.శిరీష, రుక్మిణిగా పి.గోదారెడ్డి, నారదుడిగా పి.అరుణారెడ్డి, వసంతకుడు పాత్రను చవ్వసునీత, నళినిగా అనూషలు నాటకంలో తమ పాత్రలను చక్కగా ప్రదర్శించారు.
నేటి తరానికి నాటకరంగ ప్రాముఖ్యతను తెలపాలి
నేటి తరం విద్యార్థులకు నాటకరంగ ప్రాముఖ్యతను తెలియజేయాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. పద్యనాటక ప్రదర్శన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వరలహరి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళలు పద్యనాటకాన్ని ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. ఈ నాటకాన్ని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రదర్శించేలా చూస్తామని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త, నాటక రచయిత పల్లెర్ల రాంమోహనరావు, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, మాస్టర్ వేణుగోపాలచారి, స్వరలహరి కల్చరల్ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు నాయిని భాగన్నగౌడ్, డీకే.ఆంజనేయులు, మేకల శ్రీనివాస్, గంగాపురం పవన్‌కుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

పాలమూరులో అలరించిన శ్రీకృష్ణ తులాభారం