
అకాల వర్షాలు.. పంటలో జాగ్రత్తలు
అలంపూర్: అకాల వర్షాలతో పంటకు నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా వివిధ దశలో ఉన్న మొక్కజొన్న, పత్తి, వరి, పసుపు వంటి పంటకు నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కురుస్తున్న ఆకాల వర్షాలతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. ఈ దశలో పంటను కాపాడుకోవడానికి రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటను రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటే కొంత వరకు రైతులకు మేలు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వివిధ పంటను కాపాడుకోవడానికి సూచనలు ఇలా..
వరి
● వరి పంట ప్రస్తుతం పొట్టు దశలో చివరి దశలో ఉంది. గింజ గట్టిపడి కోతకు సిద్ధంగా ఉంది.
● కోతకు సిద్ధంగా ఉన్నా..లేదా గింజ గట్టిపడి వెన్ను వంగి ఉన్న దశలో పైరు పడిపోతే పొలంలోకి చేరిన నీటిని తొలగించుకోవాలి.
● గింజకు శిలీంధ్రాలు ఆశించకుండా గింజ నల్లబడకుండా ఉండటానికి ఒక లీటర్ నీటికి 2 మి.లీ. హెక్సా కొన జోల్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
● ఖాళీగా ఉన్న పొలాల్లో ఈ తేమతో దుక్కి దున్నుకోవాలి.
● హైబ్రిడ్ వరిలో వర్షాల వలన సుంకు రాలిపోవడం జరుగుతుంది. ఈ మేరకు కొంత నష్టం జరుగుతుంది.
● వరి కోత దశలో ఉన్న సమయాల్లో తొందరపడి కోయకుండా వారం రోజుల పాటు ఆగి ఆ తర్వాత మొదలు పెట్టుకోవాలి.
● కోత కోసిన పైర్లను వాటిని పొలాల్లో కాకుండా పొలం గట్ల మీద వేసుకోవాలి. పొలాల్లోనే ఉంటే మొలకలు వచ్చే ప్రమాదం ఉంటుంది. గట్లపై వేసిన పైరుపై లీటర్ నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి చల్లాలి. ఇలా చేస్తే మొలక రాదు.
● వర్షాలు తగ్గిన తర్వాత పంటను నూర్పిడి చేసి ఎండలో బాగ ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.
పత్తి
● పత్తి సాగు చేసిన రైతులు ఎట్టి పరిస్థితుల్లో పంట పైరు కాలన్నీ పొడగించరాదు. తేమను ఆసరాగా చేసుకోని లోతు దుక్కిలు చేసుకోవాలి.
పసుపు
● తడిసిన దుంపలను భూమి నుంచి వేరు చేసి టార్పాలిన్ బరకలతో కప్పుకోవాలి.
● దుంపలు తడవడం వలన ఎండిన తర్వాత రంగు మారుతాయి. మార్కెట్‌కు తీసుకెళ్లే మంచి ధర లభించే అవకాశం ఉండకపోవచ్చు.
● ఆశించిన ధర లభించాలంటే దుంపలను పాలిషింగ్ చేయాలి. దీని వలన నాణ్యత పెరిగి మంచి ధర లభిస్తోంది. అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వారి సహాయ సహకరాలను తీసుకోవాలని సూచించారు.
పాడి–పంట
మొక్కజొన్న
కోతకు వచ్చిన పంటను ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకోని కోత కోయరాదు.
వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత కోతను ప్రారంభించుకోవడం మంచిది.
కోసిన కంకులు తడిస్తే వెంటనే పొలం నుంచి బయటికి తెచ్చి ప్రత్యేక గాలి మరల ద్వారా 100 శాతం ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టకపోతే ధాన్యం రంగు మారుతుంది. బూజుపట్టే అవకాశం లేకపోలేదు. తినడానికి పనికిరాకుండా పోవడం, విక్రయానికి తీసుకెళ్లిన ఆశించిన మద్దతు ధర లభించకపోవడం జరుగుతుంది.
గింజలు తడిస్తే నీడలో ఆరబెట్టి గాలి పంకాల ద్వార ఆరబెట్టుకోవాలి. వర్షాలు తగ్గిన తర్వాత ఎండలో ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.

అకాల వర్షాలు.. పంటలో జాగ్రత్తలు

అకాల వర్షాలు.. పంటలో జాగ్రత్తలు