మన్ననూర్: నల్లమలలో అటవీ ప్రాంతంలోని వణ్యప్రాణులు, చెంచుపెంటల్లో ప్రజల దాహార్తి తీర్చేందుకు సౌరశక్తితో బోరుబావులు ఏర్పాటు చేయనున్నట్లు మార్చుసా కార్పొరేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు అన్నారు. బుధవారం రాంపూర్, పుల్లాయిపల్లి తదితర చెంచుపెంటల్లో పర్యటించారు. ఈ సందర్భంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమిత్ బజోరియా మాట్టాడుతూ.. నల్లమలలోని మన్ననూర్, అమ్రాబాద్, మద్దిమడుగు, దోమలపెంట రేంజ్ పరిధిలో తాగునీటి సమస్యలను అధిగమించేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా సౌరశక్తితో తాగునీరు అందించే బోరుబావులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సూర్యోదయం మొదలుకొని సూర్యస్తమయం వరకు ఈ బోరుబావులు పనిచేసే విధంగా రూపకల్పన చేసినట్లు వివరించారు. ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టు వరుసగా రెండేళ్లపాటు బంగారు పథకాలను సాధించిందని తెలిపారు.