నైపుణ్య శిక్షణ కేంద్రం అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్య శిక్షణ కేంద్రం అభివృద్ధికి కృషి

Mar 16 2025 1:45 AM | Updated on Mar 16 2025 1:43 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డలో నిర్మిస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రం అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్తల సహకారం తీసుకుంటామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రాన్ని శనివారం గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ కంట్రోల్స్‌ సంస్థ డైరెక్టర్‌ రాజీవ్‌ త్రివేదితో కలిసి పరిశీలించారు. ఇందులో విద్యార్థులకు అవసరమయ్యే తరగతి గదులు తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం మున్సిపల్‌ నిధులతో క్లాక్‌టవర్‌ వద్ద వేసిన పవర్‌ బోరును పరిశీలించారు. ముడా నిధులతో ఆర్‌ఓ ప్లాంట్‌, ప్రత్యేక షెడ్‌ సైతం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డులోని జంతు వధశాల పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అంతకుముందు మున్సిపల్‌ కార్యాలయంలో ఆర్‌పీలతో సమావేశమయ్యారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీపై దరఖాస్తుదారులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఆవరణలో నిర్మిస్తున్న కళాభారతి భవనాన్ని తనిఖీ చేశారు. అలాగే కల్వరిగుట్టపై తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో కలిసిన ఎంబీ చర్చి సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు.

ఉన్నత స్థితికి చేరుకోవాలి

మహిళలు కుట్టు శిక్షణలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో కలెక్టర్‌ బంగ్లా సమీపంలోని వివేకానంద కమ్యూనిటీ హాలు టైలరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలపాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారు సర్టిఫికెట్‌ పొందితే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎ.ఆనంద్‌కుమార్‌గౌడ్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ డి.మహేశ్వర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈఈ సంధ్య, మెప్మా ఇన్‌చార్జ్‌ డీఎంసీ ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement