అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి

Mar 12 2025 7:42 AM | Updated on Mar 12 2025 7:37 AM

గద్వాల క్రైం: అనుమానాస్పదంగా వృద్ధురాలు మృతి చెందిన ఘటన గద్వాలలో చోటుచేసుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్‌ తెలిపారు. వివరాలు.. మోమిన్‌ మహాల్ల కాలనీకి చెందిన చిన్నమ్మ(85) కొన్ని రోజుల క్రితం కిందపడి తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఉన్నా ఆమె బాగోగులను పట్టించుకునే వారు కాదు. రాఘవేంద్ర కాలనీలోని అనాథశ్రమంలో ఉండేది. వారం రోజుల క్రితం వృద్ధురాలిని కుమారులు జలదుర్గం రమేష్‌, రాజు మోమిన్‌ మహాల్లలోని స్వంత ఇంట్లో(పాడుబడ్డ)కి తీసుకొచ్చారు. ఆమెకు వంతులవారీగా ఆహారం అందించేవారు. అయితే సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు వృద్ధురాలికి ఆహారం అందించి చీకటి గది కావడంతో వెలుతురు కోసం కొవ్వొత్తిని వెలిగించి మంచం సమీపంలో పెట్టి వెళ్లారు. ఆమె నిద్రించే క్రమంంలో కొవ్వొత్తికి దుప్పటి తగిలి మంటలు వ్యాపించి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే స్థానికులు మాత్రం ఆమెను కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలికి గద్వాల సీఐ శ్రీను చేరుకొని పరిశీలించారు. కేసు విచారణలో నిజనిజాలు నిర్ధారణ అవుతాయని ఆయన వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

రైలు నుంచి పడి వ్యక్తి..

ఆత్మకూర్‌: ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ అశోక్‌ కథనం మేరకు.. సోమవారం అర్ధరాత్రి మండల పరిధిలోని శ్రీరాంనగర్‌ రైల్వేస్టేషన్‌ – గద్వాల రైల్వేస్టేషన్‌ మధ్య 184వ కిలోమీటరు వద్ద పట్టాలపై 45 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. మంగళవారం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 87126 58608, 83412 52529 సంప్రదించాలని సూచించారు.

బావిలో పడి..

శాంతినగర్‌: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వడ్డేపల్లి పుర పరిధిలోని శాంతినగర్‌ జములమ్మ ఆలయ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు జములమ్మ దేవర చేస్తున్నారని కలుకుంట్లకు చెందిన మద్దిలేటి (36) ఆలయానికి వచ్చి వెనక ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. బంధువుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శాంతినగర్‌ పోలీసులు వివరించారు.

లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

తాడూరు: మండల కేంద్రానికి సమీపంలోని మల్కాపూర్‌ గేట్‌ కాజ్వే బ్రిడ్జి వద్ద మంగళవారం సాయంత్రం కోళ్ల ఎరువుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

మామిడితోట దగ్ధం

రాజాపూర్‌: మండలంలోని రాయపల్లికి చెందిన మహిళా రైతు మాధవి మామిడితోట సోమవారం రాత్రి అగ్నికి ఆహుతైంది. గ్రామస్తుల కథనం మేరకు.. పోలేపల్లి శివారులోని పరిశ్రమల నుంచి వెలువడే పొగతో పాటు నిప్పు రవ్వలు వచ్చి రైతు పొలంలో పడి ఎండిన గడ్డి అంటుకొని మంటలు వ్యాపించి మామిడి తోట కాలిపోయిందన్నారు. రైతులను నష్టపరుస్తున్న పరిశ్రమలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జడ్చర్లలో పశుగ్రాసం..

జడ్చర్ల: పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో కౌలు రైతు సంజీవ్‌ నిల్వ చేసిన పశుగ్రాసం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని కాలి బూడిదైంది. వరి గడ్డివాము నుంచి మంగళవారం ఒక్కసారిగా పొగలు రావడంతో రైతు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసి పొక్లెయిన్‌తో చెల్లాచెదురు చేసినా ఫలితం లేకపోయింది. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వపరంగా సాయం అందించి ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు.

అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి  
1
1/2

అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి

అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి  
2
2/2

అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement