కొల్లాపూర్: నియోజకవర్గ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రాజుకుంది. 15 రోజుల క్రితం జాలుపెంట, చుక్కలపెంట ప్రాంతాల్లో అడవి అంటుకొని మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పివేయడంలో కొల్లాపూర్ అటవీ శాఖాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాతావరణ మార్పుల కారణంగా మంటల వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. చిన్నపాటి మంటలే కదా అనుకున్న అటవీ అధికారులకు కార్చిచ్చు తలనొప్పిగా మారింది. కొన్ని రోజులుగా అధిక వేడితో పాటు గాలులు వీస్తుండడంతో మంటల సమీప ప్రాంతాలకు వ్యాపించాయి. జాలుపెంట, చుక్కలపెంట, పెగ్గర్లపెంట, తొంగిచూపులు ప్రాంతాల్లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలను అదుపుచేయలేక సమస్యను ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో వారి ఆదేశానుసారం మంటలను ఆర్పేందుకు బ్లోయర్స్‌ను వినియోగిస్తున్నారు. అయినా కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. శివరాత్రి సందర్భంగా అటవీ మార్గంగుండా శ్రీశైలం వెళ్లిన శివస్వాములే మంటల వ్యాప్తికి కారణమై ఉంటారని ఫారెస్టు రేంజర్ చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. అడవిలో మంటలు వ్యాప్తి చెందుతున్నాయని గొర్రెలు, పశువుల కాపరులతో పాటు ఇతరులు ఎవరూ అనుమతుల్లేకుండా అడవిలోకి ప్రవేశించరాదని ఆయన హెచ్చరించారు. అగ్ని ప్రమాదం కారణంగా అడవిలో జీవజాలం చనిపోతుందని, దీనివల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుందని ఆయన వివరించారు. మంటలను అదుపుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జాలుపెంట, చుక్కలపెంటల్లో 15 రోజుల క్రితం అంటుకున్న అడవి
రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న మంటలు
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ శాఖాధికారులు
ఉన్నతాధికారుల ఆదేశంతో వినియోగంలోకి బ్లోయర్స్
నల్లమలలో కార్చిచ్చు