మల్దకల్: వాటర్ హీటర్ ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ ఘటన మల్దకల్ మండలం ఉలిగేపల్లిలో తీవ్ర విషాదం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. ఉలిగేపల్లికి చెందిన కుర్వ నాగేంద్ర – జయమ్మ కుమారుడు పవన్‌కుమార్ (8) గ్రామంలోని పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శనివారం ఇంట్లో ఆడుకుంటున్న బాలుడు.. వేడి నీటి కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వాటర్ హీటర్‌ను పట్టుకోవడంతో షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ నందికర్ తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
పాన్‌గల్: తాగునీరు అనుకొని పొరపాటున గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. పాన్‌గల్ మండలం శాగాపూర్‌కు చెందిన పుట్టపాగ శ్రీనివాసులు (47) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి రోజు సాయంత్రం వేళలో ఇంటికి మద్యం తెచ్చుకొని తాగే అలవాటు ఉంది. మూడు రోజుల క్రితం తన పొలంలోని మామిడితోటకు పిచుకారీ చేయగా మిగిలిన గడ్డి మందును వాటర్ బాటిల్‌లో పోసి ఇంట్లో పెట్టాడు. ఈ నెల 7న రోజు మాదిరిగానే బయటి నుంచి మద్యం తెచ్చుకున్న శ్రీనివాసులు.. ఇంట్లో ఉంచిన మంచినీరు బాటిల్ అనుకొని పొరపాటున గడ్డి మందు ఉన్న బాటిల్ తీసుకుని మద్యంలో కలుపుకొని తాగాడు. కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య అలివేల, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అలివేల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
బావిలో పడి
వివాహిత..
లింగాల: ప్రమాదవశాత్తు బావిలో పడి వివాహిత మృతిచెందిన ఘటన లింగాల మండలం కొత్తకుంటపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగరాజు వివరాల మేరకు.. కొత్తకుంటపల్లికి చెందిన చెంచు మహిళ అనూష (19) తన భర్త పరుశరాములు, చిన్నమ్మ ఎల్లమ్మతో కలిసి గ్రామ సమీపంలోని బావి వద్ద బట్టలు ఉతికేందుకు వెళ్లింది. బట్టలు ఉతుకుతున్న క్రమంలో అనూష ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయింది. భర్త రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో గొర్రెల కాపరి..
ఆత్మకూర్: అనుమానాస్పద స్థితిలో గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన ఆత్మకూర్ మండలం తూంపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేందర్ వివరాల మేరకు.. మండలంలోని గుంటిపల్లికి గొళ్ల చెన్నయ్య (48)కు తూంపల్లికి చెందిన పద్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మూడునెలల క్రితం పద్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే చెన్నయ్య గ్రామంలోని తన ఇంటిని అమ్ముకుని పక్షం రోజుల క్రితం భార్య వద్దకు వెళ్లిపోయాడు. తన వద్ద ఉన్న గొర్రెలు, పశువులను కాస్తూ తూంపల్లిలోనే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి గ్రామ శివారులో అతడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి సోదరి గొళ్ల మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మూడు తులాల
బంగారం చోరీ
గద్వాల క్రైం: గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి మూడు తులాల బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటన శనివారం పట్టణంలోని హమాలీకాలనీలో చోటుచేసుకుంది. పరుశరాముడు కూలీ పనులుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు వారిలాగే తన కుమారుడు ఇళ్లు పక్కనే ఉండడంతో రాత్రి నిద్ర పోయేందుకు వెళ్లాడు. తను ఉంటున్న ఇంటికి తాళం వేసి ఉండడం గమనించిన గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. ఉదయం ఇంటికొచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకొని సమాచారం సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.