యథేచ్ఛగా ఆక్రమణలు..అక్రమ నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా ఆక్రమణలు..అక్రమ నిర్మాణాలు

Aug 20 2024 2:10 AM | Updated on Aug 20 2024 2:10 AM

యథేచ్

యథేచ్ఛగా ఆక్రమణలు..అక్రమ నిర్మాణాలు

క్రిష్టియన్‌పల్లి సర్వే నం.523లో ఇష్టారాజ్యం

రెవెన్యూ యంత్రాంగానికే సవాల్‌ విసురుతున్న వైనం

కళ్ల ముందు కట్టడాల జోరు.. అటకెక్కిన సర్వేలు

అధికారుల వైఖరితో లబ్ధిదారుల బేజారు

కలెక్టర్‌ లాగిన్‌ పేరు చెప్పి తప్పించుకుంటున్నసిబ్బంది

మహబూబ్‌నగర్‌ రూరల్‌: నిజమైన లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. అక్రమార్కులు మాత్రం దర్జాగా నిర్మాణాలు చేస్తున్నారు. అదేదో పట్టా భూమి అనుకుంటే పొరపాటే. జిల్లాకేంద్రానికి కూతవేటు దూరంలో రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమి. క్రిష్టియన్‌పల్లి రెవెన్యూ గ్రామ శివారులో సర్వే నం.523లో పుట్ట గొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఈ నిర్మాణాలపై ఆ ప్రాంతవాసులు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే.. ఒకటి.. రెండు నిర్మిస్తే రావడానికి రాదు.. పది పదిహేను ఇళ్ల నిర్మాణాలు జరిగిన తర్వాత వచ్చి పరిశీలించి కూల్చివేస్తామని చెప్పడం గమనార్హం.

స్థానికులు ఫిర్యాదు చేసినా..?

కొందరు అధికారుల నిర్లక్ష్యం రెవెన్యూ శాఖకే చెడ్డపేరు తీసుకువచ్చేలా ఉంది. మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండల రెవెన్యూ అధికారుల పనితీరు చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేసుకొని అక్రమ కట్టడాలు సాగిస్తున్నా.. ఆక్రమణదారులు తమను ఎవరు ఏమి చేయలేరనే ధీమాతో ఏకంగా రెవెన్యూ అధికారులకే సవాల్‌ విసిరే స్థాయికి చేరుకుంటున్నారు. అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు ఏళ్ల తరబడి కాలయాపన చేస్తుంటే ఆక్రమణదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అర్బన్‌ మండలంలోని క్రిష్టియన్‌పల్లి రెవెన్యూ గ్రామ శివారు సర్వే నం.523లో ఆక్రమణదారులు రెచ్చిపోయి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసుకొని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. దీనిపై స్థానికులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా తూతూమంత్రంగా విచారణ చేసి కలెక్టర్‌ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. కొంతమంది పైరవీకారులు రెండు రోజులకోసారి రాత్రి పూట మంతనాలు సాగించడం అనుమానాలకు తావిస్తుంది. ఒక కులానికి చెందిన కొంతమంది నాయకులు సెటిల్‌మెంట్ల కోసమే తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రతిసారి ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, గిర్దావర్లు అక్రమ నిర్మాణాలపై తూతూమంత్రంగా విచారణ జరుపుతున్నారు. ఆ విచారణ నివేదిక ఏమైందో ఎవరికి తెలియదు. కానీ, కలెక్టర్‌ పేరు చెప్పి కలెక్టర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది.. ఆర్డర్‌ రావాల్సి ఉందని చెబుతున్నారు. ఈలోపు క్రిష్టియన్‌పల్లి సర్వేనంబర్‌ 523లో ఆక్రమణకు గురైన స్థలాల్లో దాదాపు కట్టడాలు పూర్తయ్యాయి. తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు అక్రమ నిర్మాణాలు అరికడుతున్నారా.. లేక వారిని ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. క్రిష్టియన్‌పల్లిలో గుట్టుగా సాగుతున్న ఆక్రమణల వ్యవహారాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా కలెక్టర్‌ను ఆ కాలనీ వాసులు కోరుతున్నారు.

క్రిష్టియన్‌పల్లి రెవెన్యూ శివారులో సర్వే నం.523లో అక్రమంగా నిర్మించిన ఇళ్లు

వెంటనే కూల్చివేయాలి

క్రిష్టియన్‌పల్లి శివారులో అక్రమ నిర్మాణాలపై ఆర్డీఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. స్థలాలు కేటాయింపు జరిగి ఇళ్లు నిర్మించుకోని పట్టాలు పీఓటీ చట్టం కింద ప్రభుత్వం ఇది వరకే రద్దు చేసింది. ఆ స్థలాలను ఇళ్లు లేని నిరుపేదలకు కేటాయించాలి. వెంటనే అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, ఫోర్జరీ సంతకాలతో బోగస్‌ పట్టా లు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాసులు,

ఉదయ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

సర్వే కొనసాగుతుంది..

సర్వే నం.523లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను గుర్తిస్తున్నాం. అందుకోసం జిల్లా ఉన్నతాధికారులకు కూడా సర్వే కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను కేటాయించాలని కోరాం. ప్రస్తుతం 523 సర్వే నంబర్‌లో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా మా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

– ఘన్సీరాంనాయక్‌, తహసీల్దార్‌,

మహబూబ్‌నగర్‌ అర్బన్‌

యథేచ్ఛగా ఆక్రమణలు..అక్రమ నిర్మాణాలు1
1/4

యథేచ్ఛగా ఆక్రమణలు..అక్రమ నిర్మాణాలు

యథేచ్ఛగా ఆక్రమణలు..అక్రమ నిర్మాణాలు2
2/4

యథేచ్ఛగా ఆక్రమణలు..అక్రమ నిర్మాణాలు

యథేచ్ఛగా ఆక్రమణలు..అక్రమ నిర్మాణాలు3
3/4

యథేచ్ఛగా ఆక్రమణలు..అక్రమ నిర్మాణాలు

యథేచ్ఛగా ఆక్రమణలు..అక్రమ నిర్మాణాలు4
4/4

యథేచ్ఛగా ఆక్రమణలు..అక్రమ నిర్మాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement