
హడలెత్తిస్తున్న చిరుత
● టీడీగుట్ట ప్రాంతంలో ఇటీవల సంచారం
● ఎస్పీ జానకి, సెర్చ్ బృందాల రాక
● చిరుతను పట్టుకునేందుకు కొనసాగుతోన్న ఆపరేషన్
● రాత్రి వరకు కానరాని జాడ
● నేడు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం
స్థానికుల్లో కలకలం
చిరుతను పట్టుకునేందుకు హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ నుండి ప్రత్యేక బృందం శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకోనుంది. జిల్లా కేంద్రంలోని టీడి గుట్ట ఏరియాలో పోలీసులు, ఫారెస్టు అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నా మరోవైపు చిరుత పులి ప్రజలకు కనిపిస్తూ సవాల్ విసురుతోంది. గురువారం టీడీ గుట్ట వద్ద గుండుపై చిరుత కనిపించడంతో స్థానికుల్లో కలకలం రేపింది. దీంతో స్పందించిన అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో ప్రత్యేక బృందాన్ని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎఫ్‌ఆర్‌ఓ కమాలుద్దీన్ తెలిపారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట ప్రభుత్వ పాఠశాలకు అతి సమీపంలో చిరుత మళ్లీ కనిపించడం కలకలం రేపింది. గురువారం సాయంత్రం తిర్మల్‌దేవునిగుట్ట సమీపంలోని గుండుపై చిరుత ఉండటాన్ని గమనించిన స్థానిక ప్రజలు అప్రమత్తమై ఫోన్‌లో చిత్రీకరించారు. వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సెర్చ్ బృందాలు అక్కడికి చేరుకొని గుట్ట చుట్టుపక్కల గృహాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎస్పీ జానకి, డీఎఫ్‌ఓ సత్యనారాయణ, ఎఫ్‌ఆర్‌ఓ కమాలుద్దీన్‌లు టీడీ గుట్ట ఏరియాలో చిరుత కనిపించిన ప్రదేశానికి చేరుకున్నారు. చిరుత కనిపించిన దృష్ట్యా ప్రజలు గుమిగూడటంతో వారిని చెదరగొట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అయినప్పటికీ చిరుత చిక్కకపోవడం, చీకటి పడటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు చిరుత కనిపించిన ప్రదేశం టీడిగుట్టకు ఇరువైపులా పోలీసులు, ఫారెస్టు అధికారులు పహారా కాస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రజలు బయటిరావద్దని సూచించారు.
రెండు వారాలుగా సెర్చ్ ఆపరేషన్
గత రెండు వారాలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నా చిరుత ఆచూకీ దొరకడంలేదు. చిరుతను పట్టుకునేందుకు అధికారుల బృందం రెండు బోన్‌లను, సీసీ కెమెరాలను, రెండు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అటవీశాఖకు చెందిన మూడు బృందాలు, పోలీసు సిబ్బంది గుట్టపైకి చేరుకొని డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే గత నెల 28న చిన్నదర్పల్లి పరిదిలోని అటవీ ప్రాంతం సమీపంలో పంట పొలాల వద్ద ఆవుదూడపై రాత్రి వేళలో చిరుత దాడి చేసింది. 30న వీరన్నపేట సమీపంలోని హెచ్‌ఎన్ ఫంక్షన్ హాల్ ఏరియాలో గుట్టపై చిరుగుతున్న వీడియోలను స్థానికులు చిత్రీకరించారు, అనంతరం ఈ నెల 2న అదే గుట్టపై మరోసారి చిరుత కనిపించింది. 13న గుట్టకు సమీపంలో తెల్లవారుజామున చిరుత కనిపించడం కలకలం రేపింది. ఒక వైపు సెర్చ్ ఆపరేషన్ జురుగుతుండగానే గురువారం టీడీ గుట్ట ప్రభుత్వ స్కూల్‌కు సమీపంలోని గుట్టపై ఉన్న గుండుపై చిరుత పడుకొని ఉండటాన్ని స్థానిక ప్రజలు గమనించారు. భయాందోళనలో స్థానికులు అటవీ, పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకొని వెతికినా దొరకకపోవడం కలకలం రేపింది. తమకు రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో ఎస్పీ జానకి అక్కడికి చేరుకొని.. పోలీసులు అందుబాటులో ఉండి రక్షణ కల్పిస్తారని పేర్కొన్నారు.

హడలెత్తిస్తున్న చిరుత