
గురుకుల పాఠశాలకు నాసిరకం బియ్యం సరఫరా
లింగాల: విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని ప్రభుత్వం అంటున్నప్పటికి ఆచరణలో అమలు కావడం లేదు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలకు సరఫరా అయిన నాణ్యత లేని బియ్యాన్ని గురువారం తిరిగి స్టాక్ పాయింట్‌కు పంపారు. ప్రతి నెల అచ్చంపేట స్టాక్ పాయింట్ నుంచి గురుకులానికి బియ్యం సరఫరా అవుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభం కాగా గురుకులానికి స్టాక్ పాయింట్ నుంచి సరఫరా అయిన బియ్యం నాణ్యత లేక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల దాదాపుగా 70 క్వింటాళ్ల బియ్యం గురుకులానికి వస్తుంటాయి. తెల్లటి పురుగులు ఉండడం, అంతే గాక ఉండలు కట్టి ఉన్న బియ్యాన్ని సరఫరా చేయడంతో గమనించిన పాఠశాల వారు కొన్ని రోజుల పాటు అలాగే వండి విద్యార్థులకు పెట్టారు. వండిన తర్వాత పురుగులు ఉండడం గమనించిన విద్యార్థులు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. వచ్చిన స్టాక్‌లో నాణ్యత లేని సగం బియ్యాన్ని తిరిగి స్టాక్ పాయింట్‌కు పంపారు. బియ్యాన్ని శుభ్రం చేయించుటకు కూలీలకు చెల్లించిన డబ్బులు తిరిగి పంపిన బియ్యం హమాలీల ఖర్చులు మొత్తం పాఠశాల వారికి అదనపు భారంగా మారింది.
బియ్యంలో పురుగులు ఉన్న మాట వాస్తవమే
గురుకులానికి సరఫరా అయిన బియ్యంలో తెల్లటి పురుగులు ఉన్న మాట వాస్తవమేనని ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. జూన్ నెలలో అచ్చంపేట స్టాక్ పాయింట్ నుంచి సరఫరా అయిన 70 క్వింటాళ్ల బియ్యం నాణ్యత లేదని పేర్కొన్నారు. వచ్చిన బియ్యంలో సగం బస్తాలను తిరిగి స్టాక్ పాయింట్‌కు పంపినట్లు, ఇక ముందు ఇలా జరుగకుండా చూస్తామని వివరించారు.