
బహుజన వీరుడు పండుగ సాయన్న
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పేద ప్రజల హక్కులకు రక్షణ కల్పించిన బహుజన వీరుడు పండుగ సాయన్న అని ఒలంపిక్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్ అన్నారు. పండుగ సాయన్న 134వ జయంతిని పురస్కరించుకొని గురువారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం పాటు పడిన గొప్ప వ్యక్తి సాయన్నను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పెత్తందారి, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు అని కొనియాడారు. అనంతరం పండుగ సాయన్న సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా, పాలమూరు యూనివర్సిటీకి పండుగ సాయన్న పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని కోరారు. పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పెద్దలు చొరవ చూపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో శివన్న, మైత్రి యాదయ్య, లక్ష్మీదేవి, కృష్ణయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.