
మాట ఇస్తున్నా.. పార్టీ మారను
సాక్షి, నాగర్‌కర్నూల్/ నాగర్‌కర్నూల్: ‘బీఆర్‌ఎస్ కార్యకర్తలకు మాట ఇస్తున్నా.. నేను పార్టీ మారను.. ఇప్పటికే పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయ్యాను. నాకు ఎమ్మెల్యే పదవి కన్నా బీఆర్‌ఎస్ పార్టీనే ముఖ్యం. మీ వెనుక ఉంటాను. పార్టీ కోసం కష్టపడుతాను. పార్టీలో కష్టపడిన వారికి పదవులు దక్కుతాయి. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించినా బీఆర్‌ఎస్ కోసమే పనిచేస్తాను’ అని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌లో ఉంటూనే ఎవరెవరు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నది తనకు తెలుసన్నారు. తాను ఓడినా బాధలేదని, ఇప్పుడే అసలు రాజకీయాలను నేర్చుకుంటున్నానని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలు బాధపడుతుంటే, దొంగలు మాత్రం ఇతర పార్టీల్లో చేరి సుఖపడుతున్నారని దుయ్యబట్టారు.
గులాబీ జెండా ఎగరాలి..
రాష్ట్రంలో 30 జిల్లా పరిషత్‌ల్లో 22 స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుస్తుందని, పార్టీ కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే బీజేపీ నాయకులు ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదని, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనన్నారు. ఇకనుంచి మన ఇలాకాలో కాంగ్రెస్, బీజేపీల కథలు నడవనివ్వమన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.72 వేల కోట్ల రైతుబంధు రూ.28 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని కానీ ఏనాడు కూడా కేసీఆర్ ప్రచారాల ఆర్భాటం చేయలేదన్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం ఏదీ చేయకుండానే ప్రకటనలకు పరిమితం అవుతున్నారని విమర్శించారు. పింఛన్‌న రూ.్4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళలకు రూ.2,500, యువతులకు స్కూటీలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు శశిధర్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ హన్మంత్ రావు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పదవి కన్నా బీఆర్‌ఎస్ పార్టీనే ముఖ్యం
నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి