
‘లింగ నిర్ధారణ’ ఫిర్యాదుపై అధికారుల విచారణ
అమరచింత: పట్టణానికి చెందిన ఓ గర్భిణి లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై గురువారం తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్య బృందం గురువారం విచారణ చేపట్టింది. పట్టణానికి చెందిన గర్భిణి కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకొని ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేసుకుందని గర్భిణి మహిళకు చెందిన బంధువుల్లో ఒకరు రెండు నెలల కిందట కేంద్ర మంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వైద్య బృందం తెలిపింది. దీంతో గత నెలలో వనపర్తి జిల్లా డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించారని మరోసారి ఇరు జిల్లాలకు చెందిన డీఎంహెచ్‌ఓలు విచారించాలని ఆదేశాలు రావడంతో అమరచింతకు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదు రాలితో పాటు గర్భిణి మహిళతో మాట్లాడి నివేదిక సిద్ధం చేశామన్నారు. కేవలం కుటుంబ తగాదాలతోనే సదరు మహిళ ఆరోపణలు చేసినట్లు గర్భిణి తమ దృష్టికి తీసుకొచ్చిందన్నారు. ఇద్దరు అమ్మా యిల పుట్టిన తర్వాత ఆమె గర్భమే దాల్చ లేదని తమతో చెప్పినట్లు తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగప్రసాద్, లీగల్ అడ్వైజర్ సుమలత, డెమో శ్రీనివాసులు, వనపర్తి జిల్లా డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు, డాక్టర్ మంజుల, సూపర్‌వైజర్ నరసింహారావు, పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ ఫయాజ్, రూపశ్రీ పాల్గొన్నారు.
రూ.10 కోట్ల ధాన్యం మాయం.. యజమానిపై కేసు నమోదు
కోస్గి: పట్టణంలోని రైస్ మిల్లుల్లో ఈ నెల 8న పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించగా శ్రీ లక్ష్మీ నర్సింహా రైస్ మిల్లులో రూ.10 కోట్లకు పైగా విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై గురువారం రాత్రి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సైదులు ఫిర్యాదు మేరకు మిల్లు యజమాని చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాల్‌రాజ్ తెలిపారు. నర్సింహా రైస్ మిల్లుకు 2022–23 రబీ సీజన్‌లో 56,625 ధాన్యం బస్తాలు, 2024–25 ఖరీఫ్ సీజన్‌లో 22,792 బస్తాల ధాన్యంను సీఎంఆర్ బియ్యం తిరిగి ఇచ్చే ఒప్పందంతో కేటాయించారు. అయితే ధాన్యం తీసుకొని నిర్ణీత గడువులోగా బియ్యం అందించాల్సిన మిల్లర్ అందించకపోవడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. అధికారికంగా 75417 బస్తాల ధాన్యం ఉండాల్సి ఉండగా కేవలం 86 బస్తాల ధాన్యం మాత్రమే మిల్లులో నిల్వ ఉన్నట్లు గుర్తించారు. మాయమైన 3013.24 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ రూ.7.48 కోట్లు ఉండగా, 25 శాతం జరిమానా, 12 శాతం వడ్డీతో కలిపి రూ.10.72 కోట్లను యజమాని చెల్లించాల్సి ఉంది. నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించకపోవడంతో సంబంధిత రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
హోంగార్డు అదృశ్యంః
కేసు నమోదు
వనపర్తి రూరల్: పట్టణంలోని రామ్‌నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 16 నుంచి కనిపించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని బీచుపల్లి అనే అతను గద్వాల్ జిల్లాలోని జెన్‌కో కంపెనీలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఈనెల 16న ఇంటి నుంచి వెళ్లిన అతను మళ్లీ తిరిగి రాలేదు. దీంతో భార్య జయలక్ష్మి గురువారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.