
సూపర్ నాన్న
మహబూబ్‌నగర్
ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2024
పిల్లల్లో తండ్రుల పోలికలే అధికం
సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా తండ్రి పోలికలు, గుణాలే ఉంటాయి. దీనికి జన్యుపరమైన అంశాలే కారణమని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లినప్పుడు తల్లి కంగారు పడిపోతుందని అందరికీ తెలుసు. కానీ, ఉద్యోగం చేస్తూ పిల్లలను సాకుతున్న తండ్రులు కూడా పిల్లలను ఇంట్లో వదిలివెళ్లినప్పుడు అంత కంటే ఎక్కువగానే బాధపడతారట. ఒక సందర్భంలో వారు ఉద్యోగ బాధ్యతలు వదలించుకోవడానికి సిద్ధపడటంతో పాటు పిల్లల కోసం భార్యతో ఇంటి పనులను పంచుకోవడానికి ఎక్కువ మంది తండ్రులు ఇష్టంగా ఉంటారని తేలింది. ఉద్యోగం, ఇల్లు సమాజం కన్నా పిల్లలతో కలిసి జీవించడం.. వారితో కలిసి ఆడుకోవడమే ఇష్టమని చెప్పిన తండ్రులే ఎక్కువని తెలుస్తోంది.
అన్ని విషయాల్లోతోడుగా నిలిచారు..
దేశంలోనే ఉన్నతమైన సివిల్ సర్వీసెస్ సాధించడంలో నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. నాన్న సరోజ్‌కుమార్ చిన్నతనం నుంచి అన్ని విషయాల్లో తోడుగా నిలిచారు. ఆయన వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌లో ఈఈగా పనిచేస్తున్న సమయంలోనూ నా చదువు విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక అంశాల్లోనూ ప్రావీణ్యం ఉండాలని వాటిని నేర్పించారు. రాత్రివేళలో చదువుకునేటప్పుడు టీ ఇవ్వడం, పరీక్షల సమయంలో దగ్గరుండి డ్రాప్ చేయడం, బాధలో ఉంటే ధైర్యం చెప్పడం నాన్నతో నాకున్న తీపి జ్ఞాపకాలు. నిరుత్సాహ పడుతున్న వేళ వెన్నంటి ప్రోత్సహించి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నా కన్నా.. నాన్నే ఎక్కువ కష్టపడ్డారు. అన్ని విషయాల్లో ఒక మంచి స్నేహితుడిగా అండగా నిలిచారు.
థాంక్యూ
మై డాడ్.
● నేటితరం తండ్రుల్లో పెరిగిన స్నేహశీలత
● ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా మారుతున్న పాత్ర
● ఒకప్పటి భయం.. ఇప్పుడు స్నేహంగా రూపాంతరం
● అమ్మకు ధీటుగా..పిల్లలకు చేరువగా
నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం
అమ్మా.. అనే పిలుపుతో ఎవరినైనా పిలుస్తాం.. కానీ, నాన్న అనే పిలుపు ఒక్క కన్నతండ్రికే సొంతం.. చేయి పట్టుకొని నడిపించే మార్గదర్శకుడు. ఆపదలో అభయప్రదాత.. పిల్లలకు ఏం కావాలో తెలుసుకొని.. భవిష్యత్‌లో వాళ్లేం కావాలో దిశానిర్దేశం చేస్తాడు.. బిడ్డల ఎదుగుదలను చూసి.. తనలో తానే మురిసిపోతాడు.. పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగితే నలుగురికి చెప్పుకొని గర్వపడతాడు.. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా.. వెన్నంటి నిలిచేవాడే నాన్న.. ఓటమిపాలై కుంగిపోతున్నప్పుడు నేనున్నా.. అని వెన్ను తట్టి ధైర్యం చెప్పేవాడు నాన్న. లోపాలను సరిచేస్తూ.. మన భవిష్యత్‌కు పునాదులు వేస్తూ నిరంతరం శ్రమించే శ్రామికుడు నాన్న.. ఓ వైపు ఉన్నత గమ్యం చూపుతూ.. మరోవైపు అనురాగానికి అర్థం చెబుతాడు. అలా తండ్రి చేయి పట్టుకొని ఉన్నత గమ్యం వైపు నడిచిన వారు కోకొల్లలు.. ఆదివారం ‘ప్రపంచ తండ్రుల దినోత్సవం’ సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం..
– పాలమూరు/ సాక్షి, నాగర్‌కర్నూల్
తండ్రులు వారి పిల్లల అభివృద్ధిలో ఆశ్చర్యకరంగా ఒక పెద్ద పాత్రను పోషిస్తున్నారు. ఈనాటి తండ్రి అంటే ఓ స్నేహితుడు.. ఓ తత్వవేత్త.. ఓ విమర్శకుడు.. ఇలా అన్నీ తానై.. ముందుకు నడిపిస్తున్నాడు. ఒక కొత్త అధ్యయనంలో పిల్లల చిన్నతనంలో భాష, సాంఘిక నైపుణ్యాల అభివృద్ధిలో తండ్రి కీలకమైన పాత్రను పోషిస్తున్నారని తెలిసింది. నాన్న మారిపోయాడు.. ఔను, ఆధునిక సమాజంలో మార్పులకు అనుగుణంగా.. కుటుంబానికి తగ్గట్టుగా.. ఆ మాటకొస్తే పిల్లలకు నచ్చినట్లుగా ఒదిగాడు. చిన్న పిల్లలకు గురువుగా.. వారి వయసు పెరిగేకొద్ది స్నేహితుడిగా.. వారికి పెళ్లయ్యాక మార్గదర్శిగా మారిపోయాడు. కుటుంబం కోసం తనను తాను మార్చుకున్నాడు. తన కలల రూపాలైన పిల్లల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఉద్యోగం, కష్టాలు, అసౌకర్యాలు, అనర్థాలు ఎన్ని ఎదురైనా ఎదురుగా పిల్లలు కనిపిస్తే తానూ చిన్న పిల్లాడిలా మారిపోవడం నేర్చుకున్నాడు. పిల్లలు ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు.. పరిష్కారం దొరకక సమస్యల్లో సతమతమవుతున్నప్పుడు.. ఓ జవాబుగా మారిపోతున్నాడు. ఒకప్పటి గాంభీర్యాన్ని మమకారంగా మార్చి కరిగిపోవడం నేర్చుకున్నాడు. పిల్లల మనసులో ఏముందో కనుక్కోవడానికి తన మనసు విప్పే విద్యను అవపోసన పట్టేశాడు. అందుకే అమ్మకు ధీటుగా.. నాన్న కూడా పిల్లలకు దగ్గరైపోయాడు. అందుకేనేమో.. నేటితరం పిల్లల్లో చాలామంది నాన్నకు ప్రేమతో దగ్గరైపోయారు.
● ప్రస్తుతం ఫాదర్స్ డే అంటూ ఓ కొత్త పండుగ సంస్కృతిగా మారిపోయింది. మాతృ దినోత్సవం మాదిరిగానే దీనికి ప్రపంచం అంతటా ప్రాధాన్యం పెరిగిపోయింది. జూన్ నెలలో మూడో ఆదివారం దీనిని పాటిస్తున్నారు. అప్పట్లో నాన్న పట్ల ఉండే భయం.. ఇప్పుడు స్నేహంగా మారిపోయింది. అప్పట్లో కనిపించే ఆరాదనాభావం ఇప్పుడు స్ఫూర్తిమంత్రంగా తయారైంది. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మీ నాన్నకు చెబుతా అని అప్పట్లో ఎవరైనా బెదిరిస్తే పిల్లుల్లా బెదిరిపోయే పిల్లలు.. ఇప్పుడు అన్నీ వారే తండ్రికి చెప్పేస్తున్నారు. ఇందుకు సమాజంలో వచ్చిన ఆధునిక సౌకర్యాలు, అక్షరాస్యత, టెక్నాలజీ, మనోవికాసం, ఆర్థిక స్థోమత వంటి పరిణామాలన్నీ తండ్రి– పిల్లల వైఖరిని మలుపు తిప్పాయి.
నా చిన్నప్పటి అన్ని విషయాల్లో మా నాన్నే ఆదర్శం. ఇంజినీరింగ్ అయిన తర్వాత ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా.. నిర్దేశించుకున్న ఐఏఎస్ లక్ష్యాన్ని సాధించేందుకు అందులో చేరలేదు. సివిల్స్ రెండు ప్రయత్నాల్లోనూ సాధించలేకపోయా. ఆ సమయంలో మా నాన్న కొండంత అండగా నిలిచి.. వెన్నంటి ప్రోత్సహించారు. మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా. మా నాన్న వల్ల, మా కుటుంబ సభ్యుల అండదండలతో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాను.
– బీఎం సంతోష్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల
వెన్నంటి ప్రోత్సాహం

సూపర్ నాన్న

సూపర్ నాన్న

సూపర్ నాన్న