
పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో జూరాల
● కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
ధరూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో.. నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు వివరించారు. శనివారం ప్రాజెక్టుకు 9,259 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 406 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 133 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్‌కు 315 క్యూసెక్కులు ఇలా.. మొత్తం ప్రాజెక్టు నుంచి 1,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.894 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
రామన్‌పాడులో 1,018 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో నీటి లెవల్ పెరుగుతోంది. జూరాల సమాంతర కాల్వ ద్వారా నీటిని వదులుతున్నారు. శనివారం నాటికి పూర్తి నీటి మట్టం 1,018 అడుగులకు చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. సమాంతర కాల్వ ద్వారా 470 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. తాగునీటి అవసరాల కోసం 20 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ఏఈ. సింగిరెడ్డి రనీల్‌రెడ్డి తెలిపారు.