రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రిగా జూపల్లి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రిగా జూపల్లి

Dec 10 2023 12:50 AM | Updated on Dec 10 2023 8:39 AM

- - Sakshi

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రి జూపల్లి

సాక్షి, నాగర్‌కర్నూల్‌: రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి పదవి మరోసారి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకే దక్కింది. నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రిగా కొల్లాపూర్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టబెట్టారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పాటు, తాజాగా మరోసారి పాలమూరు జిల్లాకే ఆ శాఖల బాధ్యతలు రావడంతో నల్లమల ప్రాంతం, ఇక్కడి విశిష్టమైన వన, జంతు సంపద, ఎకో టూరిజం, కృష్ణాతీర ప్రాంతాల అభివృద్ధిపై జిల్లావాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ప్రభుత్వ పాలనలో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, దర్శనీయ స్థలాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి.. అభివృద్ధి పనులు కొనసాగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పర్యాటకం రంగంపై..
ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన భారీ రిజర్వాయర్ల వద్ద బోటింగ్‌ ఏర్పాటు, సౌకర్యాల కల్పనతో పెద్దఎత్తున పర్యాటకలను ఆకర్షించేందుకు ఆస్కారం ఉంది. పురాతన ఆలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద సౌకర్యాల కల్పనతో పర్యాటకం పెరగనుంది.

జోగుళాంబ శక్తిపీఠం, నల్లమలలోని శైవక్షేత్రాలు, శ్రీశైల ఉత్తరద్వారంగా పేరొందిన ఉమామహేశ్వర క్షేత్రం, మన్యంకొండ తదితర ప్రాంతాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి పర్చాల్సి ఉంది. పురావస్తు శాఖ సైతం జూపల్లి పరిధిలోనే ఉండగా.. జోగులాంబ శక్తిపీఠం సమీపంలోని పురాతన బ్రహ్మదేవాలయాలు, క్షేత్ర అభివృద్ధిపై మరింత దృష్టిసారించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎకో టూరిజంతో మేలు..
ప్రకృతి రమణీయ ప్రాంతాలు, సహజసిద్ధమైన వనాలు, వన్య మృగాలను సంరక్షిస్తూనే పర్యాటకులను ఆకర్షించే ఎకో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించాలన్న డిమాండ్‌ స్థానికుల్లో నెలకొంది. ప్రధానంగా నల్లమల అభయారణ్యంలో పర్యాటకులు, సందర్శకుల ద్వారా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఎకోటూరిజం ద్వారా అమూల్యమైన వృక్షసంపద, వన్యప్రాణులను వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

ఇప్పటికే అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో టైగర్‌ స్టే ప్యాకేజీ, టైగర్‌ సఫారీ, వ్యూ పాయింట్‌ వీక్షణం కొనసాగుతున్నా పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిస్థాయిలో లేవు. అలాగే కృష్ణాతీర ప్రాంతంలోని సోమశిల, అమరగిరి, మంచాలకట్ట, మల్లేశ్వరం తదితర తీరప్రాంతాల్లో కాటేజీలు, బోటింగ్‌ సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఎకో టూరిజం, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ద్వారా స్థానికంగా ఉన్న యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం దక్కనుంది.
ఇవి చ‌ద‌వండి: పవన్‌ సీఎం రేసులో లేనట్టే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement