వెల్దండ: మండలంలోని పెద్దాపూర్ గ్రామ శివారులోని వెంచర్‌లో బుధవారం రాత్రి ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన శశివర్ధన్(19), ఓ మండలానికి చెందిన బాలిక (15)కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యానికి పాల్పడ్డారు. గురువారం వ్యవసాయ పొలానికి వెళ్తున్న రైతులు గమనించి అబ్బాయి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రైవేట్ వాహనంలో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. శశివర్ధన్ హైదరాబాద్‌లో కారు మెకానిక్ పని చేసేవాడు. ఇటీవల ఆమనగల్లుకు వచ్చి మెకానిక్ షాప్‌లో పనిచేస్తున్నాడు. అమ్మాయి హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లోని ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వారి కులాలు వేర్వేరు కావడం, అమ్మాయి మైనర్ కావడంతో కుటుంబ పెద్దలు వారిని హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.