‘సీఎమ్మార్’లో భారీ గోల్‌మాల్
● సుమారు 30వేల ధాన్యం బస్తాలు పక్కదారి, రూ.5కోట్లు హాంఫట్
● అయిజకు చెందిన ఓ మిల్లర్ బాగోతం
● అధికారుల అండతో సర్కారుకు బురిడీ
● గత సీజన్‌వి భర్తీ చేయకున్నా క్లియరెన్స్ సర్టిఫికెట్
● యథేచ్ఛగా మళ్లీ కేటాయింపులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దందాలకు కేరాఫ్‌గా మారిన నడిగడ్డలో అక్రమార్కుల హవానే కొనసాగుతోంది. కస్టం మిల్లింగ్ రైస్‌నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న మిల్లర్ల మాఫియా అధికారుల అండతో రెచ్చిపోతోంది. పెట్టుబడి లేకుండా సర్కారు సొమ్ముతో యథేచ్ఛగా వ్యాపారం చేస్తూ.. కోట్లాదిగా డబ్బులు కూడగట్టుకుంటోంది. పేదలకు అందాల్సిన నాణ్యమైన బువ్వను వారి నోటి కందనీయకుండా మాయ చేస్తోంది. ఇంత జరుగుతున్నా.. పట్టించుకునే వారే లేకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ కేంద్రంగా దేవుడి పేరుతో ఉన్న ఓ రైస్ మిల్లులో సీఎమ్మార్ రైస్‌లో భారీగా గోల్‌మాల్ చోటుచేసుకోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మిల్లర్ ధన దాహం.. సివిల్ సప్లయ్ శాఖలోని పలువురి అధికారుల కక్కుర్తి వెరసి పెద్దమొత్తంలో సీఎమ్మార్ ధాన్యం బస్తాలు పక్కదారి పట్టాయి. ఈ అవినీతి బాగోతంలో తవ్విన కొద్దీ కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.
రూ.5కోట్ల విలువైనబస్తాలు మాయం..
2021–22 రబీకి సంబంధించి సదరు మిల్లుకు అధికారులు 2,165.68 మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ ధాన్యం కేటాయించారు. లెక్కప్రకారం దీన్ని మర ఆడించి 1472.66 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సదరు మిల్లర్ తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ ఇందులో రూ.5కోట్ల మేర విలువ జేసే సుమారు 30వేల బస్తాల ధాన్యాన్ని ఆ మిల్లర్ బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నాడు. జిల్లా సివిల్ సప్లయ్‌శాఖలో పలువురు అధికారులు, సిబ్బందికి అంతా తెలిసే ఈ తతంగం జరిగినట్లు సమాచారం.
‘శ్రీనివాసుడి’ మాయ


