కేసముద్రం: పాఠశాల భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. గురువారం మండలంలోని అర్పనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూన్ 12న పాఠశాల పునఃప్రారంభం అవుతున్నందున విద్యార్థుల కోసం నాలుగు తరగతి గదులను సిద్ధం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. డీఈఓ వెంట ఎంఈఓ కాలేరు యాదగిరి ఉన్నారు.
ఏఐ లైఫ్ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ
మహబూబాబాద్ అర్బన్: ఆర్టిిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లైఫ్ స్కిల్స్‌పై నాలుగు రోజుల పాటు ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు డిగ్రీ ఆపైన చదివిన బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ మాడిశెట్టి నరసింహస్వామి గురువారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. నూతన సాంకేతికతను ప్రజలకు అందించడమే లక్ష్యంగా మ్యాజిక్ బస ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ అనుసంధానంతో జూన్ 1నుంచి 4వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ, యువకులు హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈ నెల 30వ తేదీ వరకు హాజరై దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 0870– 2571192 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
28న బక్రీద్
మహబూబాబాద్ రూరల్ : ముస్లింలు బక్రీద్ వేడుకలను ఈనెల 28న నిర్వహించుకోవాలని జిల్లా ఇస్లాహే మాషిరా కమిటీ అధ్యక్షుడు మమ్మద్ ఇక్బాల్, జిల్లా మైనార్టీ నాయకుడు ఎండీ.హారుణ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27న పెద్దల పండుగ జరుగుతుందని, 28న బక్రీద్ పండుగ నిర్వహించుకోవాలని, 29వ తేదీ రాత్రి స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి సందల్ (గంధం), కందిల్ ఊరేగింపు ప్రారంభిస్తారన్నారు. 30న ఈదులపూసపల్లిలోని హజరత్ సయ్యద్ ఇమాంషావలి దర్గాలో ఉర్సు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జ్‌గా శ్రీకాంత్ గౌడ్
ఇనుగుర్తి: తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌గా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గురువారం నియమించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధినేత్రి కవితకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ప్రతీ గ్రామంలో పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


