సరస్వతీనదికి పుష్కరోత్సవం.. | - | Sakshi
Sakshi News home page

సరస్వతీనదికి పుష్కరోత్సవం..

May 22 2026 4:40 AM | Updated on May 22 2026 4:40 AM

భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతి అంతర్వాహిణి నదికి అంత్య పుష్కరాల పుష్కరోత్సవం ఆరంభమైంది. గురువారం నుంచి జూన్‌ 1వ తేదీ వరకు పుష్కరాలు జరగనున్నాయి. తెల్లవారుజామున మంగళహారతులతో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీస్వామి వారికి మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌, ధార్మిక సలహాదారు గోవిందహరి, కమిషనర్‌ హనుమంతరావుతోపాటు హైకోర్టు జడ్జి నందా, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మల్‌రెడ్డి రంగారెడ్డి స్వాగతం పలికారు. పుష్కరుడి ఆవాహ పూజాకార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్వామివారు త్రివేణి సంగమంలో పుష్కరుడికి ప్రత్యేక పూజలు చేసి చీర, సారె సమర్పించి పుష్కర స్నానాలు చేశారు. అనంతరం భక్తులు పుష్కర స్నానాలు చేశారు. పితృతర్పనాలు చేశారు. పిండప్రదాన పూజలు నిర్వహించారు. దీంతో పుష్కరిణి పులికించిపోయింది.

మ్యూజియం ప్రారంభించిన గవర్నర్‌..

రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా దంపతులు హైదరాబాద్‌ నుంచి నేరుగా కాళేశ్వరానికి సాయంత్రం 4 గంటలకు చేరుకున్నారు. వారికి మంత్రి శ్రీధర్‌బాబు, కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఐజీ అంబర్‌కిశోర్‌ఝా, ఎస్పీ సంకీర్త్‌ స్వాగతం పలికారు. త్రివేణి సంగమంలో పుష్కరిణిలో ప్రత్యేక కార్యక్రమాలతో నదీమాతకు పూజలు చేశారు. అనంతరం పుష్కర స్నానాలు చేశారు. అక్కడి నుంచి నేరుగా కాళేశ్వరాలయానికి చేరుకున్నారు. రాజగోపురం వద్ద గవర్నర్‌ దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. ఆశీర్వచన వేదిక వద్ద వారిని ఆలయ అధికారులు సన్మానించారు. గవర్నర్‌ దంపతులు.. కంచి పీఠాధిపతి వద్ద ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం కాళేశ్వరంలో రూ.1.20కోట్ల వ్యయంతో నిర్మించిన మ్యూజియాన్ని మంత్రి శ్రీధర్‌బాబు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌, కంచి కామకోటి పీఠాధిపతితో కలిసి ప్రారంభించారు. మ్యూజియంలోని పురాతన శిల్పకళను తిలకించారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ తదితరులు ఉన్నారు.

కనుల పండువగా గోదావరి హారతి..

సరస్వతీనది అంత్యపుష్కరాల్లో భాగంగా గురువారం మొదటి రోజు గోదావరి హారతిని కాశీ పండితులచే అట్టహాసంగా నిర్వహించారు. నవరత్నమాల హారతి విశిష్టతను భక్తులకు 45 నిమిషాలపాటు వివరించారు. ఏడుగురు పండితులు తొమ్మిది హారతులతో నయనానందకారంగా చేశారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తజనం భారీగా తరలొచ్చారు. ఈ కార్యక్రమంలో కంచి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్రసరస్వతీస్వామి, గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా దంపతులు, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ధార్మిక సలహాదారు గోవిందహరి, కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఐజీ అంబర్‌కిషోర్‌ఝా తదితరులు ఉన్నారు.

ఉత్సవమూర్తుల జలవిహారం..

సరస్వతీనది అంత్య పుష్కరాల్లో భాగంగా హంసవాహనం(పడవ)లో తెప్పోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి ఉత్సవ మూర్తులను జలవిహారం చేయించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శన..

పరంపర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా దంపతులు వీక్షించి కళాకారులను అ భినందించారు. కళల పరిరక్షణ, అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఉదయం 5: 43 గంటలకు

ముహూర్తం ప్రకారం ఆవాహ పూజ

మంత్రులు శ్రీధర్‌బాబు, సురేఖ,

ఎమ్మెల్యేలు గండ్ర, మల్‌రెడ్డి హాజరు

కంచి కామకోటి పీఠాధిపతిచే

పుష్కర స్నానాలు ప్రారంభం

గవర్నర్‌ దంపతులు, మంత్రులు,

ఎమ్మెల్యేలు, హైకోర్టు జడ్జి పూజలు

రూ.1.20కోట్లతో నిర్మించిన మ్యూజియాన్ని ప్రారంభించిన గవర్నర్‌

మొదటి రోజు భక్తులు అంతంతే..

ఉదయం 11గంటల తర్వాత ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో భక్తుల రాక తగ్గుముఖం పట్టింది. అధికారులు అంచనా వేసిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో ఘాట్లు మధ్యాహ్నానికి నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వేడిగాలులు వీయడంతో భక్తులు పెద్దగా కనిపించలేదు. సుమారు 46–47 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవడంతోపాటు వడగాలులు కూడా తీవ్రంగా వీయడంతో భక్తులు, విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్చీఫ్‌లు, తలపాగాలు, చున్నీలు, చీర కొంగులు, స్కార్ఫ్‌లు కప్పుకొని ఎండ నుంచి రక్షణ పొందేందుకు ప్రయత్నం చేశారు. కొంత మంది నీడ పట్టునే సేదదీరాల్సి న పరిస్థితి ఏర్పడింది.

ఐదు వేల మందే..

సరస్వతీనది అంత్య పుష్కరాలకు అధికారులు కనీసం రోజుకు రెండు లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే రూ.30కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేపట్టారు. మొదటి రోజు సుమారు ఐదు వేల మంది వరకే భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆలయంలో దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా రానున్న భక్తుల సంఖ్య తగ్గినట్లు చెప్పవచ్చు. రానున్న శని, ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అలాగే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షాలు కురిస్తే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏదీ ఏమైనా ఎండ తీవ్రతకు తోడు వడగాలులు వీయడంతో భక్తజనంతో బందోబస్తులో ఉన్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది తట్టుకోలేకపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement