వడదెబ్బతో ఎనిమిది మంది మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఎనిమిది మంది మృతి

May 22 2026 4:40 AM | Updated on May 22 2026 4:40 AM

హసన్‌పర్తి/కేసముద్రం/బయ్యారం/ నెల్లికుదురు/ ఏటూరునాగారం/కురవి/మొగుళ్లపల్లి/రేగొండ: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గురువారం వడదెబ్బతో ఎనిమిది మంది మృతి చెందారు. హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన కౌలు రైతు పొన్నాల భరత్‌(34) తన రెండెకరాల వరి పంటను కోసిన అనంతరం జాతీయ రహదారి సమీపంలో ఆరబోశాడు. గురువారం ఆ ధాన్యాన్ని సంచుల్లో నింపుతున్న క్రమంలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు ఉదయ, చేరాలు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే భరత్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. అలాగే, కేసముద్రం మండలం కల్వలకు చెందిన గాదె కొమురమ్మ(90) రెండు రోజులుగా కొడుతున్న ఎండలకు అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి మృతి చెందింది. మరోఘటనలో బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన కేస లచ్చమ్మ(90) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీనికి తోడు కొన్ని రోజులుగా ఎండవేడి పెరగడంతో అస్వస్థతకు గురై గురువారం మృతి చెందింది. అలాగే, నెల్లికుదురు మండలం హనుమాన్‌ నగర్‌తండాకు చెందిన గుగులోత్‌ అమృత (54) ఈ నెల 19న పెసరు పంటను తూర్పార పడుతూ అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు వెంటనే వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. అలాగే, ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మాదరి లక్ష్మి(85) ఎండలకు అస్వస్థతకు గురై గురువారం చనిపోయినట్లు మృతురాలి కుమారుడు రామయ్య తెలిపారు. అలాగే, కురవి మండలం రాజోలుకు చెందిన నల్ల లింగయ్య(70) రెండు రోజుల క్రితం మరిపెడలోని తన కూతురు ఇంటికి వెళ్లాడు. అక్కడ వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అలాగే, మొగుళ్లపల్లి మండలం పోతుగల్‌ గ్రామానికి చెందిన నాంపల్లి సక్కమ్మ(58) రోజుమాదిరిగానే గురువారం కూలీకి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చే క్రమంలో వడదెబ్బతో మృతి చెందింది. అలాగే, రేగొండ మండలం భాగి ర్తిపేట గ్రామానికి చెందిన మహ్మద్‌ యాకుపాషా (45) గురువారం మేసీ్త్ర పనికి వెళ్లగా వడదెబ్బకు గురై చనిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement