మహబూబాబాద్: తేమ, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాల్లో అవినీతిని అరికట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ కె.అనిల్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇబ్బందులు పెడుతున్న అఽధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేఽశారు. క్వింటాల్‌కు ఐదునుంచి పది కేజీలు తరుగు తేమ పేరుతో రైతులకు నష్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రరావు,. మహేష్, సతీష్, హిందూ భారతి, రేష్మా, తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
గార్ల: మండలంలోని రాంపురం నుంచి గుండ్రాతిమడుగు వరకు డబుల్ రోడ్డు బీటీ రహదారి నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని రోడ్డు ప్రతిపాదనల కాపీని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని బుధవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిసి అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, ఎస్‌కె బుడాన్ ఉన్నారు.
గుర్తూరులో గంగమ్మ జాతర
తొర్రూరు రూరల్: మండలంలోని గుర్తూరు గ్రామంలో గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలో గంగమ్మ జాతరను కనుల పండువగా బుధవారం జరుపుకున్నారు. గంగపుత్ర కులస్తులంతా కుటుంబ సమేతంగా జలబిందెలతో వెళ్లి విగ్రహాలను శుద్ధి చేసి, డప్పుచప్పళ్లు, ఆటపాటలతో నృత్యాలు చేస్తూ ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పిల్లి నాగరాజు, పిల్లి వెంకన్న, సింగరం కుమార్, సింగరం శ్రీనివాస్, సింగరం చందర్, సింగరం మురళి, పిల్లి ఐలయ్య, పిల్లి శ్రీను, సింగరం రాజు, పిల్లి ఉప్పన్న, సత్తయ్య, దయాకర్, రమేష్ పాల్గొన్నారు.
చేపల వేటకు వెళ్లి
విద్యుదాఘాతంతో మృతి
డోర్నకల్: మండలంలోని బూరుగుపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. బూరుగుపాడుకు చెందిన మాటలురాని చెరుకుపల్లి ఎర్రయ్య(40) బుధవారం మరో నలుగురితో కలిసి గ్రామ సమీపంలోని వాగు వద్దకు చేపల వేటకు వెళ్లాడు. విద్యుత్ తీగతో నీటిలో చేపలు పడుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీఐ చంద్రమౌళి ఆదేశాల మేరకు ఎస్సై వంశీధర్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
అత్యాచారయత్నం..
కేసు నమోదు
తొర్రూరు రూరల్: ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్‌రెడ్డి బుధవారం తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తమ ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు వద్దకు వెళ్లి కిందపడిన మామిడి పండ్లు తీసుకుంటుంది. ఈక్రమంలో పున్నం నర్సయ్య అనే వ్యక్తి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసినట్లు తెలిపారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
కళాకారులను ఆదుకోవాలి
నెహ్రూసెంటర్: తెలంగాణ ఉద్యమంలో తమ పాటలు ద్వారా మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన తెలంగాణ కళాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, ప్రజానాట్య మండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కేతరాజు ఉప్పలయ్య అన్నారు. సంఘం జిల్లా మహాసభ బుధవారం వీరభవన్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన కళాకారులను ఆదుకోవాలని సూచించారు. హైదరాబాద్ ఈనెల 25, 26న జరిగే రాష్ట్ర మహాసభలకు జయప్రదం చేయాలని పిలుపిచ్చారు. కార్యక్రమంలో అజయ్ సారథి రెడ్డి, కట్లోజు పాండురంగాచారి, కేదాసు రమేష్, అజ్మీర వేణు పాల్గొన్నారు.


