బయ్యారం: ఏజెన్సీ ప్రాంత ప్రజలకు యాసంగి పంటగా పేరున్న తునికాకు సేకరణపై కూలీలకు ఆసక్తి తగ్గింది. ఒకప్పుడు కుటుంబం మొత్తం తునికాకు సేకరణ పనుల్లో నిమగ్నం అయ్యే పరిస్థితి ఉండగా ఇప్పుడు గ్రామాల్లో ఆ పరిస్థితి కానరావడం లేదు. దీంతో బయ్యారం అటవీశాఖ పరిధిలో బయ్యారం, గార్ల మండలాల్లో ఉన్న మూడు యూనిట్ల పరిధిలో గతంలో 2500మంది కార్మికులు ఆకు సేకరించగా ఈ ఏడాది 1300 మంది కార్మికులు తునికాకు సేకరణలో పాల్గొన్నారు. ఈయూనిట్ల పరిధిలో 28లక్షల కట్టల సేకరణ లక్ష్యంతో ఈనెల 2నుంచి తునికాకు సేకరణ పనులు ప్రారంభం కాగా కల్లాల మూసివేత వరకు 10.50లక్షల కట్టలను కార్మికులు సేకరించారు.
పెరగని తునికాకు....
తునికాకు ఏపుగా పెరిగేందుకు గతంలో కార్మికులు అటవీప్రాంతంలో మోడెం కొట్టేవారు. ఇలా మోడెం కొట్టడం వల్ల తునికాకు ఏపుగా పెరిగి అవసరం మేరకు లభ్యం అయ్యేది. అయితే మోడెం పనులు చేయటం వల్ల అడవిలో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయని అటవీశాఖాధికారులు మోడెం కొట్టే పనులను నిలుపుదల చేశారు. దీంతో తునికాకు దొరకక కూలీలు పనికి వెళ్లలేని పరిస్థితి వచ్చింది.
మొగ్గు చూపని కార్మికులు..
ఏజెన్సీలో గతంలో వానాకాలం పంట తరువాత యాసంగిలో ఎలాంటి పంటలు పండేవి కావు. దీంతో వానాకాలం పంటలసాగు, పిల్లల చదువు ఖర్చులకు కుటుంబసభ్యులు మొత్తం తప్పనిసరిగా తునికాకు సేకరణ పనులకు వెళ్లారు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఏజెన్సీలో పంటలసాగుకు నీటివనరులు ఏర్పడటంతోపాటు ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు అందుబాటులో ఉండటంతో తునికాకు సేకరణ జరిపే కూలీల సంఖ్య ప్రతి ఏడాది తగ్గుతూ వస్తుంది. దీనికి తోడు ఎండల ప్రభావం అధికంగా ఉండటం వల్ల కూలీలు సేకరణకు వెళ్లడానికి వెనకాడుతున్నారు. బయ్యారం అటవీరేంజ్ పరిధిలో ఉన్న కంబాలపల్లి–ఏ, కంబాలపల్లి–బి, కంబాలపల్లి–సీ యూనిట్ పరిధిలోమొత్తం 60 తునికాకు సేకరణ కల్లాలు ఉండగా ఈ ఏడాది 23 కల్లాల్లోనే తునికాకు సేకరణ జరిగింది.
యాసంగి పంటలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎండల ప్రభావమే కారణం అంటున్న అధికారులు
కట్టల సేకరణకు సగానికి పడిపోయిన కూలీల సంఖ్య


