నిప్పుల కొలిమి.. | - | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమి..

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

పట్టణం గరిష్ట కనిష్ట

మహబూబాబాద్‌ 44 27

తొర్రూరు 43 32

కేసముద్రం 44 31

డోర్నకల్‌ 43 32

మరిపెడ 44 29

సాక్షి, మహబూబాబాద్‌: భానుడికి కోపం వచ్చింది. మూడు రోజులుగా ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఎండ తీవ్రత మరింత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యా రు. ఉదయం తొమ్మిది గంటలకే ఇళ్లనుంచి బయటకు రాలేదు. 10గంటలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. సాయంత్రం ఆరుగంటల తర్వా త కూడా ఎండవేడి తగ్గకపోవడంతో జ్యూస్‌ సెంటర్లు, సోడాబండ్ల వద్ద క్యూ కట్టారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు భయపడుతున్నారు.

ఉదయం నుంచే ఉగ్రరూపం..

జిల్లాలో బుధవారం ఉదయం 10గంటల వరకే ఎండ తీవ్రత అధికం కావడంతో ప్రధాన కూడళ్లు, రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మానుకోట పట్టణంలోని కోర్టు, పోలీస్‌ స్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయం, మదర్‌ థెరిస్సా సెంటర్‌, కొత్తబస్టాండ్‌, జింకల సెంటర్‌, వైఎస్సార్‌ సెంటర్‌ ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌, కేసముద్రం మున్సి పాలిటీల్లో కూడా ప్రధాన రహదారుల్లో జనం కనిపించలేదు. రోడ్డు పక్కన డబ్బాలు, గంపల్లో పం డ్లు, కూరగాయలు, తోపుడు బండ్లు, బడ్డీకొట్లు, టీకొట్టు వ్యాపారులు ఎండ తీవ్రతను చూసి ఇళ్లకు వెళ్లిపోయారు.

ఉపశమనం కోసం..

ఎండ తీవ్రత అధికం కావడంతో వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఐస్‌క్రీమ్‌, కూల్‌ డ్రింక్‌ షాపులు, సోడా బండ్లు, జ్యూస్‌ పాయింట్ల వద్ద గుంపులు గుంపులుగా కనిపించారు. అదే విధంగా కూలర్స్‌, ఫ్యాన్లు, ఏసీల మరమ్మతులతో పాటు కొత్తవి కొనుగోలు చేయడం కనిపించింది. బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని షాపుల్లో సేల్స్‌ పెరిగాయని వ్యాపారస్తులు చెప్పారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వైద్యారోగ్యశాఖ హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని, చలివేంద్రాలు, బస్టాండ్లు, జనసందోహ ప్రాంతాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని రోజులు ఇలాగే..

మూడు రోజులుగా నిప్పుల కొలిమిలా ఎండల తీవ్రత ఉంది. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు ఉంటుందని వాతావణ కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మహబూబాబాద్‌ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సహాయక చర్యలు చేపలట్టాని కోరుతున్నారు. అయితే వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

జాగ్రత్తగా ఉండాలి

ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలి. సాయంత్రం 6గంటల వరకు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. ఉదయం ఎండకంటే సాయంత్రం ఎండ ప్రమాదకరం. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. మంచినీరు, కొబ్బరి బొండాలు, ఓఆర్‌ఎస్‌ వంటివి తీసుకోవాలి. లిక్విడ్స్‌ ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది.

– శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌,

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, మహబూబాబాద్‌

జిల్లాలో భానుడి భగభగ

ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

ఉదయం 10గంటలకే రోడ్లన్నీ

నిర్మానుష్యం

ఎండతాపం నుంచి రక్షణకు ఉరుకులు, పరుగులు

Advertisement
 
Advertisement
Advertisement