నెహ్రూసెంటర్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్‌లో ధరల పెరుగుదలపై సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర సరుకుల రేట్లు పెరిగాయన్నారు. ఆటో, లారీ, బస్సు చార్జీలు పెరిగి సామాన్యుడి జేబు కు చిల్లు పడుతోందన్నారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమా ండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సమ్మెట రాజమౌళి, రామ్మూర్తి, బానోత్ వెంకన్న, కుమ్మరికుంట్ల నాగన్న, తోట శ్రీనివాస్, చాగంటి భాగ్యమ్మ, ఎర్ర శ్రీనివాస్, మందుల మహేందర్, లాలయ్య, వార్డు కౌన్సిలర్ బానోత్ బాబు, గౌని వెంకన తదితరులు పాల్గొన్నారు.
చేయూత పింఛన్ సర్వే పూర్తి చేయాలి
మహబూబాబాద్: చేయూత పింఛన్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కిశోర్ సెర్ప్ సీఈఓ దివ్యతో కలసి కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులతో పింఛన్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా కిశోర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులను కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వీసీలో కలెక్టర్ స్నేహశబరీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమ హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించాలి
మహబూబాబాద్: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జ్యోతిబసు డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్‌కు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా జ్యోతి బసు మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న హాస్టళ్ల భవనాలకు కనీసం మరమ్మతులు చేయించాలన్నారు. సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలన్నారు. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలన్నారు. మోడల్ స్కూళ్లలో హాస్టళ్లు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాకేశ్, వంశీ, ఉపేందర్, వరుణ్, నర్మద, మనోజ్, మౌలానా తదితరులు పాల్గొన్నారు.
పుష్కరాల్లో పటిష్ట భద్రత
● భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
కాళేశ్వరం : నేటి నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున, వారికి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. బుధవారం ఆయన పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి బందోబస్తు ఏర్పాట్లపై వివరించారు. ముందుగా ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్‌ల వద్ద భద్రత, పార్కింగ్ ప్రాంతాలు, హెలిపాడ్ భద్రత, క్యూ లైన్ల నిర్వహణ, పరిశీలించారు. అనంతరం ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. పుష్కరాల్లో తప్పిపోయిన వారి సహాయక కేంద్రాలు, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీఎస్ టీమ్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు పోలీస్ శాఖకు సహకరించి సూచనలు పాటిస్తూ పుష్కరాలను సురక్షితంగా నిర్వహించుకోవాలని కోరారు.


