● కలెక్టర్ స్నేహశబరీష్
మరిపెడ: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేంద్రంలో ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు, ప్రస్తుతం ఉన్న నిల్వ, మిల్లులు, గోదాములకు తరలించిన ధాన్యం వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. గన్నీ సంచులు, టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని, లోడింగ్, అన్‌లోడింగ్‌లో వేగం పెంచాలని ఆదేశించారు. డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఏఓ సరిత, తహసీల్దార్ కృష్ణవేణి, పీఏసీఎస్ శాఖ అధికారి నరేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వేగవంతం చేయాలి..
డోర్నకల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సీరోలు మండలం మన్నెగూడెం గ్రామ శివారులోని మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, మిల్లులకు పంపిన ధాన్యం వివరాలతో పాటు ఇన్‌వార్డు, అవుట్ వార్డు రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం ఆమె రైతులు, సిబ్బందితో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, సహకారశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఏఓ సరిత, సీరోలు తహసీల్దార్ పున్నంచందర్, ఎంపీడీఓ పాషా, పీఏసీఎస్ సీఈఓ సతీష్, డోర్నకల్ సీఐ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


