● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్ : గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం రాత్రి భారీ నాకాబందీ, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అనుమానాస్పద వ్యక్తులపై పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, అత్యవసర సేవల కోసం జిల్లా పోలీసు కంట్రోల్ రూం నంబర్ 87126 56999, అత్యవసర సహాయం కోసం డయల్ 100కు ఫోన్ చేయవచ్చన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడం, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడం ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారన్నారు. కాగా, మహబూబాబాద్ సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ తిరుపతిరావు, నలుగురు సీఐలు, 18 మంది ఎస్సైలు, 100 మంది పోలీసు సిబ్బందితో 1,985 వాహనాలను తనిఖీ చేయగా నంబర్ ప్లేట్లు లేని 74 వాహనాలను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టారు. తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక నాకాబందీలో డీఎస్పీ కృష్ణకిశోర్, నలుగురు సీఐలు, 12 మంది ఎస్సైలు పాల్గొని 1,500 వాహనాలను తనిఖీ చేశారు.


