కేసముద్రం: వడదెబ్బతో మహబూబాబాద్ జిల్లా కేసముంద్రం మండలం అర్పనపల్లికి చెందిన వృద్ధుడు నేరెళ్ల సోమయ్య(72) మృతి చెందాడు. సోమయ్య రెండు రోజులుగా ఉపాధి హా మీ పనికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బకు గురై మంగళవారం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య ఉపేంద్ర ఉంది.
ములుగులో పారిశుద్ధ్య కార్మికుడు..
ములుగు రూరల్: వడదెబ్బతో ములుగు మున్సిపాలిటీ పరిధి ప్రేమ్‌నగర్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బోడ సాంబయ్య(45) బుధవారం మృతి చెందాడు. ఉదయం పని ముగించుకుని ఇంటికెళ్లిన సాంబయ్య.. మధ్యాహ్నం మళ్లీ కార్యాలయానికి వచ్చి స్టాఫ్ రూంలో పడుకున్నాడు. చాలా సమయం వరకు బయటకు రాకపోవడంతో సహ కార్మికులు వెళ్లి చూడగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో వెంటనే ములుగు జనరల్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.


