● దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
హన్మకొండ కల్చరల్: కాళేశ్వరం త్రివేణి సంగమంలో నేటినుంచి జరిగే సరస్వతి అంత్య పుష్కరాల్లో పాల్గొనే భక్తులకు అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తిచేశామని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు బుధవారం భద్రకాళి దేవాలయాన్ని మంత్రి సందర్శించారు. ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు మంత్రిని ఘనంగా స్వాగతించారు. ఆదిశంకరులు, వల్లభగణపతి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు జరుపుకున్నారు. మంత్రికి అర్చకులు తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గురువారం శ్రీశంకర విజయేంద్ర సరస్వతిస్వామీజీ పూజలు నిర్వహించి పుష్కరస్నానాలు ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం గంగాహారతి, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, ప్రజలు ప్రశాంతంగా పుష్కరస్నానాలు ఆచరించాలని కోరారు.


