గార్ల: ఎన్నికల హామీలను విస్మరించిన పాలకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి. నాగయ్య అన్నారు. బుధవారం గార్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. మొక్కజొన్న, వరిధాన్యం రైతులు బస్తాల కొరత వల్ల ధాన్యం కాంటాలు కాకపోవడంతో రైతులు నెలల తరబడి వేచి చూడలేక బయట ప్రైవేటు దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, కందునూరి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి అలవాల సత్యవతి, పెద్దవెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


