కబ్జాలకోట | - | Sakshi
Sakshi News home page

కబ్జాలకోట

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అది ప్రస్తుతం రికార్డులకే పరిమతమైంది. కబ్జాదారులు ఇప్పటికే 60శాతం ప్రభుత్వ భూములు కబ్జా చేసి విక్రయించి కోట్లు గడించారు. కాగా ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు లేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పలు చెరువులు, కుంటలకు స్వాహా చేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపాలిటీ అధికారుల మధ్య సమన్వయం లేక కబ్జాలకు చెక్‌ పెట్టలేకపోతున్నారు.

చెరువులపైనే కన్ను..

జిల్లా కేంద్రం శివారులో ఎకరం భూమి కోట్లలో పలుకుతోంది. దీంతో కబ్జాదారులు చివరికి చెరువులు, కుంటలను కూడా వదలడం లేదు. జిల్లా కేంద్రంలోని ప్రధానంగా నిజాం చెరువు, కంబాలచెరువు, బంధం చెరువు, జనాల చెరువు, రాంబందు చెరువులు ఉన్నాయి. వీటిలో విచ్చలవిడిగా కబ్జాలు జరుగుతున్నాయి.

నిజాం చెరువు చాలా వరకు కబ్జా..

జిల్లాకేంద్రంలోని నిజాం చెరువు సగం వరకు అన్యాక్రాంతమైంది. పలు కాలనీలు కూడా ఏర్పాటు అయ్యాయి. ఇరిగేషన్‌ అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఎన్‌ఓసీ ఇవ్వగానే మున్సిపాలిటీ అధికారులు కూడా డబ్బులు తీసుకుని పర్మిషన్‌ ఇచ్చారు. అలాగే జనాల చెరువు శిఖం భూముల్లో పలు పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో పేదల కోసం కాలనీలు ఏర్పాటు చేశారు. ఆయా కాలనీల పక్కన ఉన్న చెరువుల భూముల్లో వెంచర్లు చేసి కబ్జాదారులు డబ్బులు దండుకున్నారు.

నేటికీ రెండు చెరువుల్లో..

జిల్లా కేంద్రంలో ఉన్న బంధం చెరువు సగానిపై కబ్జాకు గురై కుంటగా మారింది. నేటికీ కబ్జాలు చేస్తున్నారు. బంధం చెరువు సమీపంలో గతంలోనే కబ్జా చేసి గృహ నిర్మాణం చేయగా.. మళ్లీ కొంత భూమిని చదును చేసి చుట్టూ రేకులతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ విషయంలో కౌన్సిలర్‌ చిదిరాల అరుణ.. కలెక్టర్‌, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత నిర్మాణ పనులను నిలిపివేసి కేసు పెట్టారు. బంధం చెరువుకు చెందిన కాల్వలు కబ్జాలకు గురయ్యాయి. ఆచెరువుకు సంబంధించిన పాషా వాగును కూడా కబ్జా చేసి.. అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. కలెక్టర్‌ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న కంబాలచెరువు సగం కబ్జాకు గురికాగా.. మిగిలిన చెరువులో కూడా మట్టి పోస్తుండగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు!

గత కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ పలుమార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి చెరువులకు హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్‌ చేయాలని ఆదేశించారు. కానీ తూతూ మంత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకున్నారు. ఈనెల 13 కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి అధికారులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. చెరువులు కబ్జా అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, కబ్జాలు జగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

కంబాల చెరువు, బంధం చెరువు శిఖం భూములతో పాటు బఫర్‌ జోన్‌ స్థలాలను కబ్జా చేస్తున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చాం. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. ఆ చెరువులపై చాలా కుటుంబాలు ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి.

– పిల్లి దశరథం, మత్స్య పారిశ్రామిక

సహకార సంఘం పట్టణ కార్యదర్శి

కేసులు పెడుతున్నాం..

బంధంచెరువు, కంబాలచెరువులో కబ్జాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో సర్వే చేపట్టి కబ్జా చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నాం. ఇరిగేషన్‌ అధికారుల సహకారం లేకపోవడంతో కబ్జాలు కట్టడి కావడం లేదు. వాస్తవానికి చెరువుల పరిరక్షణ పూర్తి బాధ్యత వారిదే. కాని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు.

– చంద్ర రాజేశ్వర్‌, తహసీల్దార్‌

Advertisement
 
Advertisement
Advertisement