● కొనుగోళ్లను వేగవంతం చేయాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్
నర్సింహులపేట: ధాన్యం కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్నేహ శబరీష్ హెచ్చరించారు. మంగళవారం నర్సింహులపేటలో మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వశ్రాంతండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఏ మేరకు కాంటాలు పెట్టారు.. ఎన్ని టన్నులు తరలించారు.. ఇంకా ఎంతవరకు మిగిలాయి, ఆలస్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు వివరాలు సక్రమంగా చెప్పకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ రికార్డులను సరిగా మెయింటెనెన్స్ చేయడం లేదని మండిపడ్డారు. వెంటనే పీఏసీఎస్ నిర్వాహకులు, వ్యవసాయశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరించామని, ఇంకా కొన్నిచోట్ల పనితీరు మార్చుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రవాణా విషయంలో ముందస్తుగా వాహనాలను సిద్ధం చేసుకొవాలన్నారు. హమాలీలను అధికంగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయీస్ అధికారి రమేష్, మేనేజర్ నర్సింహరావు, తహసీల్దార్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


