పుష్కరాలకు విద్యుత్‌ ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు విద్యుత్‌ ఏర్పాట్లు పూర్తి

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

హన్మకొండ: సరస్వతీనది అంత్య పుష్కరాలకు విద్యుత్‌ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు పుష్కరాలు జరుగనున్నాయి. ఈ మేరకు భక్తులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు టీజీ ఎన్పీడీసీఎల్‌ కాళేశ్వరంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నూతన లైన్ల నిర్మాణం, కొత్తగా డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసింది. విద్యుత్‌ ప్రమాదాలు జరుగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో అవసరమైన చోట ఎత్తైన స్తంభాలు ఏర్పాటు చేశారు. 9 మీటర్ల ఎత్తు స్తంభాలు 152, 8 మీటర్ల ఎత్తు స్తంభాలు 330 ఏర్పాటు చేశారు. అయిదు కిలో మీటర్ల 11 కేవీ లైన్‌, 12 కిలో మీటర్ల ఎల్‌టీ లైన్‌ కొత్తగా నిర్మించారు. మొత్తం 18 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. నిరంతరాయ విద్యుత్‌ సరఫరా నిర్వహణకు కోసం 16 కీలక ప్రాంతాల్లో 12 రోజుల పాటు రౌండ్‌ ది క్లాక్‌ పర్యవేక్షణ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.

మొత్తం 150 మంది విధులు..

సరస్వతీనది అంత్య పుష్కరాల్లో నలుగురు డివిజనల్‌ ఇంజినీర్లు, ఆరుగురు అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్లు, 13 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్లు, 12 మంది సబ్‌ ఇంజినీర్లు, 13 మంది లైన్‌ ఇన్స్‌పెక్టర్లు, 9 మంది లైన్‌మెన్‌లు, 45 మంది అసిస్టెంట్‌ లైన్‌మెన్‌లు, తదితర సిబ్బంది కలిపి మొత్తం 150 మంది విధులు నిర్వర్తించనున్నారు. డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ విఫలమైతే విద్యుత్‌ అంతరాయం తలెత్తకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మన్లను అందుబాటులో ఉంచారు.

కీలక ప్రాంతాల్లో డబుల్‌

ఫీడింగ్‌ వ్యవస్థ..

దేవాలయం, టెంట్‌ సిటీ, వీఐపీ ఘాట్‌, మెయిన్‌ ఘాట్‌, హరిత హోటల్‌ తదితర కీలక ప్రాంతాలకు డబుల్‌ ఫీడింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఒక ఫీడర్‌లో అంతరాయం ఏర్పడితే మరో ఫీడర్‌ ద్వారా వెంటనే విద్యుత్‌ సరఫరా అందించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే, బ్రేక్‌డౌన్‌ పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం కాళేశ్వరం, మహదేవపూర్‌, 132 కేవీ కాటారం సబ్‌స్టేషన్‌ వద్ద ప్రత్యేక బ్రేక్‌డౌన్‌ బృందాలను సిద్ధంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. భక్తులకు విద్యుత్‌ భద్రతా సూచనలు తెలిపేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్లు, రహదారులు, పూజామండపాల సమీపంలో ఎర్రపు, తెలుపు రంగుల హెచ్చరిక టేపులు, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేశారు.

తెప్పోత్సవం పడవ రెడీ..

కాళేశ్వరం : కాళేశ్వరంలో 12 రోజులపాటు జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు దేవాదాయశాఖ కాకినాడలో ప్రత్యేకంగా తెప్పోత్సవానికి హంసవాహన పడవను తయారు చేయించింది. ఆ పడవ మంగళవారం త్రివేణి సంగమానికి చేరుకుంది. 25 ఫీట్ల వెడల్పు, 30 ఫీట్ల పొడవుతో 40హెచ్‌పీ సామర్థ్యంతో 30 మంది కూర్చునేలా సిద్ధం చేశారు. 12 రోజల పాటు ఉత్సవ మూర్తులను ప్రత్యేక పూజలతో తిప్పనున్నారు.

విద్యార్థిని ఆత్మహత్య

ఏటూరునాగారం : అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని తాళ్లగడ్డకు చెందిన పెండ్యాల భద్రయ్య స్వరూప దంపతుకు కూతురు శ్రీవల్లి(16) వేసవి సెలవుల్లో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయపురం గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ తరచూ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మదన పడుతూ సోమవారం ఎలుకల మందు తాగింది. ఈ విషయం గమనించిన తల్లి స్వరూప.. శ్రీవల్లిని ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా, శ్రీవల్లి ఇటీవల టెన్త్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది.

సులభంగా లోపాలు గుర్తింపు, పరిష్కారం

● నెట్‌వర్క్‌ ప్రణాళికలో విప్లవాత్మక మార్పులు

18 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు

150 మందితో నిరంతరాయ పర్యవేక్షణ

Advertisement
 
Advertisement
Advertisement