పలువురి నివాళి..
జనగామ: చార్‌ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ వెళ్లిన జనగామకు చెందిన ప్రముఖ వ్యాపారి, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అరుగుల శ్రీనివాస్ (62) మృతి చెందారు. ఈ నెల 8వ తేదీన సిద్దిపేటకు చెందిన బంధువులతో కలిసి వెళ్లిన శ్రీనివాస్ కుటుంబం 10వ తేదీన కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి చేరుకుంది. యాత్రలో భాగంగా మంగళవారం ఉదయం కేదారినాథ్ దర్శనం ముగించుకుని ట్రావెల్ బస్సులో దిగువ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఘా ట్ రోడ్డులో టీ తాగిన కొద్ది సేపటికే శ్రీనివాస్‌కు శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ వెంటనే సమీపంలోని జోష్‌మఠ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు చికిత్స అందించేలోపే చనిపోయినట్లు నిర్ధారించారు.
పట్టణంలో విషాదం..
అరుగుల శ్రీనివాస్ మృతితో జనగామ పట్టణ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చైన్నెలో ఉన్న పెద్ద కూతురు, వరంగల్‌లో మరో కూతురు, జనగామలో ఉన్న కొడుకు సుశీల్ తమ కుటుంబాలతో కలిసి హుటాహుటినా కేదారినాథ్ బయలుదేరారు. రాత్రి 7 గంటల సమయంలో డెహ్రడూన్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కేదారినాథ్ వైపునకు పయనమయ్యారు. కుటుంబీకుల నిర్ణయం మేరకు శ్రీనివాస్ అంత్యక్రియలు బుధవారం కేదారినాథ్‌లోనే నిర్వహించనున్నారు.
ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు అరుగుల శ్రీనివాస్ మృతిపై జనగామ చాంబర్ అధ్యక్ష, గౌరవ అధ్యక్షులు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, రైస్ మిల్లర్స్ ప్రతినిధి పజ్జూరి జయహరి, ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహా సభ జిల్లా అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్ కుమార్, మాజీ అధ్యక్షుడు మహంకాళి హరిశ్చంద్రగుప్త, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు బిజ్జాల నవీన్ కుమార్, శర్విరాల ఉపేందర్, బుద్దా రమేశ్, వ్యాపార వర్గాలు, రాజకీయ పార్టీల నాయకులు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మృతి తీరని లోటని, అందరినీ కలచివేసిందన్నారు.
చార్‌ధామ్ మార్గంలో ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్ మృతి
శోకసంద్రంలో కుటుంబీకులు
జనగామలో విషాదం
నేడు కేదారినాథ్‌లోనే అంత్యక్రియలు


