దుగ్గొండి/కాశిబుగ్గ: తన ఇంట్లో రాత్రి ఆనందంగా జన్మదిన వేడుకలు జరుపుకుని తెల్లవారుజామున కారులో అత్తారింటికి వెళ్తున్న ఓ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పుట్టిన రోజు ఆనందాన్ని భార్యాపిల్లలతో పంచుకోకముందే రోడ్డు ప్రమాదం కబలించింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద జరిగింది. దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్‌రెడ్డి కథనం ప్రకారం.. వరంగల్ 20వ డివిజన్‌కు చెందిన వెల్దండి వరుణ్ ( 32) సోమవారం రాత్రి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. మంగళవారం తెల్ల వారుజామున కారులో నర్సంపేటలో ఉన్న భార్యా పిల్లల దగ్గరికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గిర్నిబావి వద్ద కొత్తగూడ మండలం ఓటాయి గ్రామం నుంచి మక్కలలోడుతో వస్తున్న లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్‌ను స్థానికులు 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు. కాగా, ఓ కార్ఖానా నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వరుణ్ మృతిచెందడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగారు.
ఎదురెదురుగా ఢీకొన్న లారీ, కారు
యువకుడి దుర్మరణం
గిర్నిబావి వద్ద ఘటన


