నడువ దారిలేదు.. తాగునీరు లేదు! | - | Sakshi
Sakshi News home page

నడువ దారిలేదు.. తాగునీరు లేదు!

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

మరిపెడ రూరల్‌: మండలంలోని బుర్హాన్‌పురం గ్రామ పంచాయతీ పరిధిలోని మహబూబాబాద్‌–సూర్యాపేట 365 జాతీయ రహదారి వెంట ఉన్న పల్లె దవాఖాన ప్రస్తుతం సమస్యలమయంగా మారింది. గ్రామీణ ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ దవాఖానా ఇప్పుడు కనీస మౌలిక వసతులు లేక ప్రజలకు భారంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దవాఖానాకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి ముందు గుంతను తొవ్వి వదిలేయడం కారణంగా గుంత దాటిపోవాలంటే వృద్ధులు, గర్భిణీలు, బాలింతలకు కష్ట సాధ్యంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తీసుకెళ్లేందుకు వాహనాలు కూడా చేరలేని పరిస్థితి నెలకుంది.

రోగులకు తాగునీటి గోస

ఆస్పత్రిలో తాగునీటి సౌకర్యం లేక రోగులు, వారి వంట వచ్చే కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సేవల కోసం వచ్చిన ప్రజలు నీటి కోసం బయటకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేక పోవడంతో వైద్యులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు.

సుదూర ప్రాంతంలో ఆస్పత్రి

ప్రధాన సమస్య ఏమిటంటే, ఈ పల్లెదవాఖాన గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉండటం, దీంతో నడవలేని వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులతో వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణ సౌకర్యం లేక కొందరు వైద్య సేవలకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

మౌలిక సదుపాయాలు కల్పించాలి

స్థానిక ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం కనిపించలేదని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు ప్రజలకు చేరువ కావాలంటే ముందుగా మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి పల్లె దవాఖానకు సరైన రహదారి, తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేల చర్యలు తీసుకోవాలని బుర్హాన్‌పురం, పరిసర గ్రామాల ప్రజలు కోతున్నారు.

అసౌకర్యాల మధ్య పల్లె దవాఖాన

నరకయాతన పడుతున్న రోగులు

పట్టించుకోని అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement