ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
● ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు
గార్ల: గార్లలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో వైద్యుల కొరత తీర్చి మండల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు. గార్ల సీహెచ్‌సీని ఏడేళ్ల క్రితం రూ.5కోట్లు వెచ్చించి 30పడకల ఆస్పత్రిని నిర్మించారు. కాని వైద్యుల ఖాళీలను భర్తీ చేయడంలో పాలకులు పట్టించుకోక పోవడంతో మండల ప్రజలకు ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందడం లేదు. దీంతో మెరుగైన వైద్యసేవల కోసం మండల ప్రజలు ఖమ్మం, మహబూబాబాద్ పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏజెన్సీ మండలమైన గార్ల మండల ప్రజలకు ఈ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ ఆస్పత్రికి క్యాడర్ స్ట్రెన్త్ లేక పోవడంతో గత ఏడాది వైద్యుల బదిలీల కౌన్సిలింగ్‌లో గార్ల ఆస్పత్రి కనిపించక పోవడంతో ఒక్క వైద్యుడు కూడా జాయిన్ కాలేదు. ఆస్పత్రిలో ఉన్న కొద్దిపాటి మంది డాక్టర్లు సైతం బదిలీల్లో వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో నలుగురు డాక్టర్లు మాత్రమే డిప్యుటేషన్‌పై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. సకల సౌకర్యాలు ఉన్నా, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నచందంగా సీహెచ్‌సీ తయారైంది. ఇప్పటికై నా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి ఆస్పత్రిలో వైద్యుల ఖాళీలను భర్తీ చేసి మండల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని మండల ప్రజలు డిమాండ్ చేశారు.
గార్లలో రూ.5కోట్లు వెచ్చించి నాటి ప్రభుత్వం సకల సౌకర్యాలతో 30పడకల ఆస్పత్రిని నిర్మించింది. కాని వైద్యుల పోస్టుల భర్తీని విస్మరించింది. ఏజెన్సీ మండలమైన గార్ల మండలంలో 90శాతం గిరిజనులు నివసిస్తున్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందకపోవడంతో ఖమ్మం, మహబూబాబాద్ తదితర పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు. వెంటనే సీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న వైద్యల పోస్టులను భర్తీ చేయాలి.
– కందునూరి శ్రీనివాసరావు, గార్ల


