కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జి ల్లా కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కాళేశ్వరంలో పర్యటించి కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ కళాకారులతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు భక్తులను ఆకట్టుకునేలా సంగీత, నృత్య, జానపదాలు వంటి కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు సమయపాలనతోపాటు క్రమబద్ధంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, వేదికలు, సౌండ్, లైటింగ్ తదితర ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయ పరిపాలన అధికారి విజయ్, భూపాలపల్లి టీఎస్‌ఎస్ కళాకారుడు మైసా శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ
సంచాలకుడు నర్సింహారెడ్డి


