డోర్నకల్: మండలంలోని ముల్కలపల్లికి చెందిన ధరంసోత్ తనుష్‌నాయక్ ఎప్‌సెట్ ఇంజనీరింగ్ విభాగం రాష్ట్రస్థాయిలో 95 ర్యాంక్ సాధించాడు. ముల్కలపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ధరంసోత్ వినోద్, రామలక్ష్మి దంపతుల కుమారుడు తనుష్‌నాయక్. గ్రామస్తులతోపాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.
కరపత్రాల ఆవిష్కరణ
మహబూబాబాద్ అర్బన్: జన్ భాగిదారి సబ్సే దూర్, సబ్సే పహ్లే వారోత్సవ అభియాన్ వాల్ పోస్టర్లను అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశ రామ్ నాయక్ సోమవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం మాట్లాడుతూ.. ఈనెల 18నుంచి ఈనెల 25వరకు జిల్లా వ్యాప్తంగా సబ్సే దూర్, సబ్సే పహ్లే వారోత్సవాలు నిర్వహించబడతాయన్నారు.
బోనమెత్తిన మాజీ మంత్రి
కురవి: మండలంలోని తన సొంత గ్రామమైన పెద్దతండాలో సోమవారం నిర్వహించిన బొడ్రాయి పండుగ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ దేవతకు భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు.
ఇన్‌చార్జ్ జిల్లా జడ్జి పూజలు
మహబూబాబాద్ రూరల్: వరంగల్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జే.మైత్రేయ మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టుకు ఇన్‌చార్జ్ జడ్జిగా నియామకం అయ్యారు. ఈమేరకు జిల్లా జడ్జి మైత్రేయ అనంతాద్రి జగన్నాథ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల సత్యనారాయణ, జంగం సిద్ధార్థ పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాలలో
అడ్మిషన్లు ప్రారంభం
కొత్తగూడ: ప్రభుత్వం ఇటీవల నూతనంగ మంజూరు చేసిన కొత్తగూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం అయినట్లు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో క్యాన్వసింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఏ, బీకాం కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ లైఫ్‌సైన్స్, ఫిసికల్ సైన్స్ కోర్సులు ప్రారంభం అవుతాయని తెలిపారు. అన్ని ఇంగ్లిష్ మాద్యమంలో ఉంటాయన్నారు. ప్రతీ కోర్సులో కేవలం 60మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 99081 27796 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలి
మహబూబాబాద్ రూరల్: రైతులు ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాదులు వై.చెన్నమల్లారెడ్డి, వి.రాజ్ కృష్ణ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని సండ్రలగూడెం రైతువేదికలో రైతులకు వివిధ చట్టాలపై సోమవారం అవగాహన కల్పించారు. న్యాయపరమైన సలహాలు కావాల్సి వస్తే టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి ఉచిత సలహాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో సండ్రలగూడెం సర్పంచ్ జక్క లక్ష్మయ్య, ఉపసర్పంచ్ పార్వతి, వార్డు సభ్యులు సుగుణ, పూలమ్మ, కారోబార్ పొడుగు విజయ్ పాల్గొన్నారు.
మహాసభలను
జయప్రదం చేయండి
నెహ్రూసెంటర్: తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కేతరాజు ఉప్పలయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వీరభవన్ వద్ద మహాసభల పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 20వ తేదీన సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అజ్మీర వేణు, కేదాసు రమేష్, కట్లోజు పాండురంగాచారి పాల్గొన్నారు.


