‘ఉపాధి’కి ఫీల్డ్‌అసిస్టెంట్ల కొరత | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి ఫీల్డ్‌అసిస్టెంట్ల కొరత

May 19 2026 1:52 AM | Updated on May 19 2026 1:52 AM

డోర్నకల్‌: ఉపాధి పథకం అమలుకు ఫీల్డ్‌ అసిస్టెంట్ల కొరత ఇబ్బందిగా మారింది. దీంతో ఉపాధి పనుల గుర్తింపు, కూలీలకు పనులు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండలంలోని 26 గ్రామపంచాయతీల్లో సుమారు 9000 మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. గ్రామాల్లో ప్రతీరోజూ చెరువు పూడికతీత, ఫీడర్‌ ఛానళ్ల మరమ్మతులు, గుట్టల చుట్టూ నీటి నిల్వ గుంతల తవ్వకం పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 26గ్రామ పంచాయతీల్లో కేవలం ఆరుగురు ఫీల్డ్‌ అసిస్టెంట్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. తక్కువ మంది ఉండడంతో ఒక్కొక్కరికి నాలుగు గ్రామాల చొప్పున విధులు కేటాయించారు. ఆరుగురిలో కొంతమంది అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనిభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలు ఎక్కువ కావడంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉపాధి పనుల వద్ద మేట్లపై ఆధారపడుతున్నారు.

పట్టించుకోని కార్యదర్శులు..

గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఉపాధి పథకాన్ని పట్టించుకోవడం లేదు. పథకం అమలులో భాగస్వాములు కావాల్సిన పంచాయతీ కార్యదర్శులు పథకంతో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేని గ్రామాల్లో పని ప్రదేశాలకు పనులను పరిశీలించాల్సిన పంచాయతీ కార్యదర్శులు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

రాజకీయ గ్రహణం..

గ్రామాల్లో ఉపాధి పథకంలో రాజకీయ నేతలు ఉపాధి పనుల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం, పంచాయతీ పాలకవర్గాలు నియమించిన మేట్లను ప్రస్తుత పాలకవర్గాలు తొలగిస్తుండటంతో గొడవలు జరుగుతున్నాయి. 40 నుంచి 60మందికి ఓ మేట్‌ విధులు విధులు నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం 40మందికి పైగా మేట్లు విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో ఫీల్డ్‌ అసిస్టెంట్లను నియమించి ఉపాధి పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఒకరికి నాలుగు గ్రామాల్లో బాధ్యతలు

పట్టించుకోని జీపీ కార్యదర్శులు

Advertisement
 
Advertisement
Advertisement