కొత్తగూడ: జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో వన్యప్రాణుల వేట ఆగడం లేదు. వేసవికాలం వచ్చిందంటే వేటగాళ్లు పెట్రేగిపోతున్నారు. వాగులు, వంకలు ఎండిపోయి, అటవీ మొత్తం ఆకురాల్చి మోడులా మారింది. ఈక్రమంలో వన్యప్రాణులు ఆహారం, తాగునీరు లభించే కొత్తగూడ మండలంలోని గుంజేడు వాగు, గూడూరు మండలం భీమునిపాదం వాగు, ఖానాపురం మండలం పాకాల సరస్సు, గంగారం మండలం బొట్లశెలిమె లాంటి నీటివసతి వైపునకు వెళ్తుంటాయి. కాగా, వేటగాళ్లు వన్యప్రాణులు వెళ్లే దారిని గమనించి, అడ్డుగా విద్యుత్ వైర్లు అమర్చి హతమారుస్తున్నారు. మాంసాన్ని గుట్టుగా పట్టణ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు..
ఇటీవల పట్టణ ప్రాంతానికి వన్యప్రాణి మాంసం తరలిస్తుండగా ఓమాంసం ముద్ద కొత్తగూడ మండల కేంద్రంలో పడిపోయింది. దీనిపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తుండగానే.. గుంజేడు జాతర సమీపంలో వన్య ప్రాణుల వేటకు అమర్చిన విద్యుత్ ఉచ్చుల్లో పడి గేదె మృతి చెందింది. వన్యప్రాణులను వేటాడి పట్టణ ప్రాంతాల్లో మాంసం విక్రయిస్తు పట్టుబడిన సంఘటనలు కోకొల్లలు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారుల్లో ఉలుకు పలుకు లేకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
నిర్లక్ష్యానికి నిదర్శనంగా అటవీశాఖ..
విధుల నిర్వహణలో అటవీశాఖ ఉద్యోగులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్ శాఖ తర్వాత అంతే భాద్యత కలిగిన అటవీశాఖ ఉద్యోగులు రోజూ పట్టణ ప్రాంతాల నుంచి వచ్చివెళ్తూ నామమాత్రపు విధులు నిర్వహించడం వల్లే వన్య ప్రాణుల వేట నిరాటంకంగా కొనసాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి పూట తనిఖీలు, కూంబింగ్‌లు ఉండేవి.. అవేవి ఇప్పుడు కనిపించడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు రేంజర్, సిబ్బంది మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వన్యప్రాణులను కాపాడేందుకు సంబంధిత శాఖ అధికారులు ఇకనైనా మేలుకోవాలని స్థానికులు అంటున్నారు.
వన్యప్రాణులను వేటాడితే
కఠిన చర్యలు
వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడ వేటాడినట్లు తెలిసినా సంబంధిత సెక్షన్, బీట్ అధికారిపై చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణుల వేటను అడ్డుకునేందుకు స్థానికుల సహకారం తీసుకుంటాం. సిబ్బంది స్థానికంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటా.
–చంద్ర శేఖర్, ఎఫ్‌డీఓ
ఏజెన్సీలో నిద్రావస్థలో అటవీ శాఖ
వేసవిలో పెట్రేగిపోతున్న వేటగాళ్లు


