మహబూబాబాద్ అర్బన్: రన్నింగ్, వాకింగ్, వ్యాయామంతో మెరుగైన ఆరోగ్యం పొందవచ్చని ఎస్పీ శబరీష్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో సోమవారం 2కే రన్ నిర్వహించగా.. ఎస్పీ శబరీష్, మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి హాజరై జెండా ఊపి ప్రారంభించారు. మదర్‌థెరిస్సా సెంటర్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వ్యాయామం, క్రీడలతో యవతకు క్రమశిక్షణ, ఏకాగ్రత పెరగడంతో పాటు చదువులో ముందుంటారన్నారు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు వ్యాయామంతో ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత పొందుతారన్నారు. విద్యార్థులు, యువకులు క్రీడలపై ఆసక్తి పెంచుకొని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఓలేటి జ్యోతి, కోచ్‌లు వేలిశాల కుమారస్వామి, రాంబాబు, చాంప్లానాయక్, పీఈటీలు, పీడీలు, కాళోజీ వాకర్స్ అసోసియేషన్, ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ శబరీష్


