మహబూబాబాద్: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల నిర్వహణలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్నేహ శబరీష్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్ స్వయగా వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో వస్తున్నారని, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని ఆదేశించారు. పెండింగ్ వినతులను కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. రెండు మూడు రోజుల నుంచి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు, తరలింపు జరుగుతుందన్నారు. అధికారులు అంకితభావంతో పని చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో 132 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం శివారు కంబాలచెరువులో అక్రమంగా మట్టి పోసి కబ్జా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అశోక్, దశరథం తదితరులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడా వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
కలెక్టర్ స్నేహ శబరీష్
ప్రజావాణిలో 132 వినతులు


