మరిపెడ రూరల్: మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ నాయక్ న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంర్భంగా మౌంటైనర్ యశ్వంత్‌నాయక్ తన స్ఫూర్తిదాయకమైన పర్వతారోహణ ప్రయాణం, ఇప్పటి వరకు సాధించిన విజయాలు, అదేవిధంగా తన ప్రతిష్టాత్మకమైన ‘హర్ శిఖర్ పర్ తిరంగా’మిషన్ కింద చేపట్టనున్న భవిష్యత్ యాత్రలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు వివరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలపై భారతజాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. యశ్వంత్‌నాయక్ సాధించిన విశేష విజయాలను అభినందించిన లెఫ్టినెంట్ గవర్నర్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు తెలిపారు. సాహసం, పర్వతారోహణ రంగాల ద్వారా దేశానికి గుర్తింపు తీసుకురావడంలో యశ్వంత్ నాయక్ చూపుతున్న అంకితభావం, పట్టుదల, దేశభక్తి స్ఫూర్తిని గవర్నర్ ప్రశంసించారు.


