మహబూబాబాద్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, ప్రణాళికలు రూపొందించే విషయంలో జనాభా గణాంకాలు కీలకం. ప్రస్తుతం జన గణనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేశారు.
జిల్లాలో 7,74,000 జనాభా
2011 లెక్కల ప్రకారం 7,74,000 జనాభా ఉన్నట్లు సీపీఓ అధికారులు తెలిపారు. మళ్లీ 2021 జన గణన జరగనుండగా కోవిడ్, పలు కారణాలతో గణన ఆసల్యమైనట్లు అఽధికారులు పేర్కొన్నారు. జన గణన విషయంలో గత నెల 15, 16, 17 తేదీల్లో కలెక్టరేట్‌లో జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేశారు. జిల్లాలో ఎన్యుమరేటర్లు 1,450 మంది, సూపర్‌వైజర్లు 252 మంది (మొత్తం 1,702) జన గణనలో పాల్గొననున్నారు. వారికి ఇప్పటికే గణనకు సంబంధించిన బుక్‌లెట్స్, ఇతర విషయాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. అలాగే కిందిస్థాయి సిబ్బందికి ఈనెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు మండల స్థా యిలో శిక్షణ ఉంటుంది.
మే నెలలో ఇళ్ల సర్వే..
ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల సర్వే జరుగుతుంది. 2027 ఫిబ్రవరి, మార్చి నెలలో జన గణన చేస్తారు. 2027 మే నెలలో జిల్లా జనాభా స్పష్టత వస్తుంది.
డిజిటల్ విధానంలో..
ఈసారి నూతనంగా డిజిటల్ విధానంలో జనగణన జరగనుంది. మొబైల్ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నమో దు చేస్తారు. అయితే జనగణన విధులు నిర్వర్తించే వారికే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇస్తారు. డిజిటల్ విధానంలో సర్వే మరింత వేగవంతం కానుంది.
నిబంధనల మేరకు జనగణన..
జనగణన శాఖ నుంచి వచ్చిన నిబంధనల మేరకు జన గణన ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఇప్పటికే జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేశాం. జనగణనకు ప్రజలు సహకరించాలి.
– అశోక్, జిల్లా ఉపగణాంక అధికారి
జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి
ఎన్యుమరేటర్లు 1,450, సూపర్ వైజర్లు 252 మంది..
జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 7,74,000 మంది జనాభా
ఈసారి డిజిటల్ విధానంలో సర్వే


