హన్మకొండ: సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం పనిచేస్తున్న వరంగల్‌కు చెందిన టీం ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ్), రాష్ట్ర హెరిటేజ్ శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శనివారం హైదరాబాద్‌లోని పురావస్తు శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలోని పురాతన కట్టడాలు, ఆలయాలు, చారిత్రక కట్టడాలను నమోదు చేయడం, సంరక్షించడం, పునరుద్ధరించడం, ప్రోత్సహించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఈ భాగస్వామ్యంతో రెండు సంస్థలు కలిసి వారసత్వ డాక్యుమెంటేషన్, డిజిటల్ రికార్డులు తయారు చేయడం, ఆలయాలు, చారిత్రక కట్టడాల సంరక్షణ, సంప్రదాయ కళలు, జానపదం, స్థానిక జ్ఞానాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడతాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు మాట్లాడుతూ.. పురావస్తు శాఖ, టార్చ్ సంస్థ మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వారసత్వ సంరక్షణ, పరిరక్షణ, వెలుగులోకి రాని వారసత్వ ప్రదేశాల డాక్యుమెంటేషన్‌ను తమ పరిశోధనలు, పుస్తకాలు, ప్రదర్శనలు, డాక్యుమెంటరీల ద్వారా ప్రజలకు పరిచయం చేస్తున్న టార్చ్ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్‌లో తెలంగాణలోని స్మారక కట్టడాల సంరక్షణలో ఇరు సంస్థలు పరస్పరం కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. టార్చ్ సంస్థ సెక్రటరీ అరవింద్ ఆర్య మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కల్పించినందుకు హెరిటేజ్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పురావస్తు శాఖ ప్రాజెక్టుల్లో కూడా తాము పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ పగడం నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్, పురావస్తు శాఖ ఓఎస్డీ రాజు పాల్గొన్నారు.
యాదవనగర్ సెక్షన్ ఏఈ లక్ష్మణ్ సస్పెన్షన్
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్, హనుమకొండ టౌన్ డివిజన్‌లోని యాదవనగర్ సెక్షన్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎం.లక్ష్మణ్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. సాక్షిలో శనివారం ప్రచురితమైన ‘అధికారులపై చర్యలుండవా’అనే కథనంపై సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు.. స్పందించారు. హనుమకొండ సర్కిల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే రిపోర్టు పంపాలని ఎస్‌ఈ పి.మధుసూదన్ రావును ఆదేశించారు. ఎస్‌ఈ రిపోర్టు మేరకు ఎం.లక్ష్మణ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. మార్చి 30న యాదవనగర్‌లో సెక్షన్‌లో జరిగిన ప్రమాదంలో అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ పున్నం చందర్ చనిపోయిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు ఆందోళన కూడా చేశారు. ఈ ఘటనలో భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని యాదవనగర్ సెక్షన్ లైన్ ఇన్‌స్పెక్టర్, లైన్‌మెన్‌ను ఈ నెల ఒకటిన సస్పెండ్ చేశారు. ఆ రోజు సెక్షన్ ఏఈ లక్ష్మణ్ స్థానికంగా ఉండి భద్రత పరికరాలు లేకుండానే విద్యుత్ స్తంభంపై ఎక్కించినట్లు తేలడంతో యాజమాన్యం తీవ్రమైన బాధ్యతారాహిత్యంగా భావించి అతన్ని సస్పెండ్ చేస్తూ శనివారం హెచ్‌ఆర్‌డీ చీఫ్ ఇంజనీర్ ఎం.మాధవరావు ఉత్తర్వులు జారీ చేశారు.
వారసత్వ సంపద పరిరక్షణకు
అంగీకారం


