హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది తమ ప్రాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్ విధులు ప్రమాదకరమని తెలిసినా భద్రత కోసం వినియోగించాల్సిన పనిముట్లను వాడకుండా విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విద్యుత్ మరమ్మతుల సమయంలో విద్యుత్ స్తంభంపై చేరుకున్నప్పుడు విధిగా టెస్టర్‌తో పరీక్షించాలి. ఎర్త్‌రాడ్ వాడాలి. చేతికి గ్లౌజ్‌లు వేసుకోవాలి. తలకు హెల్మెట్ ధరించాలి. అయితే విధుల్లో ఉన్న సిబ్బంది వీటిని వినియోగించడం లేదు.
సబ్ స్టేషన్లు, వినియోగదారుల వివరాలు
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు 1,528 ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 3,51,115 ఉన్నాయి. గృహ వినియోగదారులు 48,23,874, వాణిజ్య, వ్యాపార వినియోగదారులు 6,32,457, ఎల్‌టీ పరిశ్రమలు 34,156, ఎల్‌టీ వ్యవసాయ సర్వీస్‌లు 13,96,285, ఇతరాలు 1,37,036 సర్వీస్‌లున్నాయి. హెచ్‌టీ పరిశ్రమలు 3,413, హెచ్‌టీ కమర్షియల్ 1,151, హెచ్‌టీ నీటిపారుదల 470, హెచ్‌టీ ఇతర సర్వీస్లు 268 ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు 5,579 మంది, ఆర్టిజన్లు 3,457, అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్‌లు 1,382 మంది పని చేస్తున్నారు.
భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే..
విద్యుత్ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం, సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి.. స్టీల్ నిచ్చెన, హెల్మట్, హ్యాండ్ గ్లౌజ్, ఎర్త్‌రాడ్, టెస్టర్ ఉద్యోగులు, సిబ్బందికి పంపిణీ చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని రూ.3వేల జరిమానా విధిస్తామని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం హెచ్చరించినా.. ఉద్యోగులు, సిబ్బంది వాడడడం లేదు. సెక్షన్ స్థాయి అధికారి అసిస్టెంట్ ఇంజనీర్లు, ఫోర్‌మెన్, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్, లైన్ ఇన్‌స్పెక్టర్లు క్షేత్ర స్థాయి సిబ్బందిచే వాటిని వాడేలా ప్రోత్సహించడంలో, వారిని ఆదేశించడంలో అలసత్వం వహిస్తున్నారు. ఫలితంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్‌లపైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రతీ సర్కిల్‌లో డీఈ టెక్నికల్‌ను సేఫ్టీ ఆఫీసర్‌గా నియమించి ప్రమాదాలపై విద్యుత్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎల్‌సీ యాప్‌ను తీసుకొచ్చి విద్యుత్ లైన్ క్లియరెన్స్‌ను సులభతరం చేశారు. ఇన్ని సౌకర్యాలు కల్పించినా ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడడం లేదు.
● ‘మార్చి 30న హనుమకొండ యాదవనగర్ సెక్షన్‌లో విద్యుత్ బకాయిల వసూళ్లు చేస్తున్న క్రమంలో సర్వీస్ డిస్‌కనెక్షన్ కోసం అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ పున్నం చందర్ నిచ్చేన సాయంతో విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.’ ఇక్కడే ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్, లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్ కూడా భద్రతా ప్రమాణాలు పాటించడంలో అలసత్వం వహించారు. అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్‌చే వాటిని ధరింపజేయడంలో విఫలమయ్యారు.
భద్రతకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ప్రాధాన్యం
సిబ్బందికి భద్రతా ఉపకరణాల పంపిణీ
ఉపకరణాల వాడకంలో నిర్లక్ష్యం
గాలిలో కలుస్తున్న ప్రాణాలు


