మహబూబాబాద్ రూరల్ : బాలిక ను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబాబాద్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ కొద్దిరోజుల క్రితం మహబూ బాబాద్ పట్టణానికి రాగా.. నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన డెకరేషన్ పనిచేసే యువకుడు చిలుకబత్తిని రంజిత్ పరిచయం చేసుకున్నాడు. బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకుని వెంట తీసుకెళ్లాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించి, అతనిపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
చిట్యాలలో..
చిట్యాల: ప్రేమ పేరుతో మైనర్‌ను వేధింపులకు గురి చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా దూత్‌పల్లి గ్రామానికి చెందిన బాణాల రాకేష్ కొంత కాలంగా ఓ మైనర్‌ను వేధిస్తూ ప్రేమించాలని వెంటబడుతూ.. బాలికకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిస్తున్నాడు. దీంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని భూపాలపల్లి సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుచగా 14 రోజులు రిమాండ్ విధించారు.
ఫేజ్ త్రీలో కొనసాగుతున్న పంపింగ్
● ఒక మోటారు పంపింగ్ బంద్
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఒక మోటారు పంపింగ్‌ను అధికారులు నిలిపివేశారు. జె.చొక్కారావు ఎత్తిపోతల వద్ద మూడు ఫేజ్‌లలో పది మోటార్లు ఉన్నాయి. అందులో ఫేజ్ త్రీలో ఐదు మోటార్లు, ఫేజ్ టూ లో ఒక మోటారుతో కొన్నిరోజులుగా నీటిని నిరంతరం దిగువకు ఎత్తిపోసిన అధికారులు శనివారం ఫేజ్‌త్రీలో ఒక మోటారు పంపింగ్‌ను నిలిపివేశారు. దీంతో రెండు ఫేజ్‌లలో ఐదు మోటార్లతో 1,414 క్యూసెక్కుల నీటి పంపింగ్ దిగువకు కొనసాగుతోంది. కాగా సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ఎగువ నుంచి 4,000 క్యూసెక్కుల నీరు చేరుతుండగా బ్యారేజీలోని గేట్లను ఎత్తి 2,586 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.


